పనులలో జాప్యంపై చంద్రబాబు పోల‘రణం’

పనులు వేగంగా జరగడానికి ప్రతి సోమవారం కొన్ని గంటల సమయాన్ని కేటాయిస్తూ కొన్ని నెలలుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న రీతిలో జరగకపోతుండడం పట్ల అసహనానికి గురవుతున్నారా? ఈ సోమవారం నాటి సమీక్షలో ఆయన అధికారులతో మాట్లాడిన తీరు గమనించిన వారికి మాత్రం అలాంటి అనుమానాలే కలిగాయి.
ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నా ఆశించిన స్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ముందుకు సాగకపోవడంతో అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలు, అధికారులపైనే వుందన్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్‌కు సంబంధించి రోజుకు లక్షన్నర క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టాలని నిర్దేశించగా కేవలం 85,277 క్యూబిక్ మీటర్ల మేరే పనులు జరగడాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టారు.
సోమవారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులను వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన ముఖ్యమంత్రి - నిర్మాణ పనుల విషయంలో మానవ వనరుల లభ్యత దగ్గర నుంచి యంత్రసామాగ్రి వరకు ఎలాంటి ఇబ్బందులున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. తన మాటలను తేలిగ్గా తీసుకుంటే సహించేది లేదని, ఏదో ఒక కారణం చెబుతూ లక్ష్యం పూర్తి చేయకపోవడం సరికాదని చెప్పారు. ప్రతిరోజు ఎంత మేర పనులు పూర్తయ్యాయో తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే వర్చువల్ ఇన్స్పెక్షన్ కోసం కాకుండా నిత్యం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి హితవు పలికారు. విధుల్లో ఎవరు నిర్లక్ష్యం చూపినా, విఫలమైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. పనుల్లో కొద్దిపాటి పురోగతి సరిపోదని, ఇంకా వేగం పెంచాల్సి వుందని చెప్పారు.
స్పిల్ వే, స్పిల్ చానల్‌కు సంబంధించి త్వరలో రోజుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు త్రివేణి సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. వివిధ పనుల ఆకృతులకు అనుమతులు వస్తే డిసెంబర్ 10 నుంచి కాంక్రీట్ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధంగా వున్నామని అన్నారు.
డంపింగ్ యార్డ్‌కు మట్టిని తరలించేందుకు వీలుగా అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే రహదారిని విస్తరిస్తున్నట్టు ట్రాన్స్ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. డంపింగ్ యార్డ్ వివాదానికి ముగింపు పలకాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సూచించిన ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ నిర్మాణం పనులు వేగవంతంగా సాగేందుకు ఎలాంటి చట్టపరమైన ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని నిర్దేశించారు. పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ముందుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు.
గత వారం స్పిల్ వేకు సంబంధించి మొత్తం 3,50,868 క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు చేపట్టాలని లక్ష్యాన్ని పెట్టుకోగా, రోజుకు 27,136 క్యూబిక్ మీటర్ల చొప్పున వారంలో 1,89,953 క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. అలాగే స్పిల్ చానల్‌కు సంబంధించి మొత్తం 6,98,194 క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు చేపట్టాలని లక్ష్యం పెట్టుకోగా, రోజుకు 58,141 క్యూబిక్ మీటర్ల చొప్పున వారంలో 4,06,988 క్యూబిక్ మీటర్ల వరకు పనులను పూర్తి చేయగలిగాయి.
అటు పవర్ హౌస్ ఫౌండేషన్‌కు సంబంధించి మొత్తం 41,487 క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు చేపట్టాలని నిర్దేశించగా, 20,683 క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వారు. 70,400 క్యూబిక్ మీటర్ల వరకు అప్రోచ్ చానల్ తవ్వకం పనులను పూర్తి చేశారు.

