పట్టిసీమ పేరుతో నీటి కేటాయింపులు పెంచగలరా?

తెలంగాణ తో మాకు ఎలాంటి విభేదాలు లేవు.. తెలంగాణతో కలసిమెలసి పనిచేయడానికి సిద్ధం అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పి ఉండవచ్చు గాక.. కానీ కృష్ణా జలాల పంపకం వంటి వివాదాలు ఇంకా తెగకుండా, ఒక కొలిక్కి రాకుండా.. రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. ఏపీ కృష్ణాబోర్డు వద్ద కంప్లయింటు చేసి.. తాజా రాజీ కోసం నిరీక్షిస్తూ కూర్చోగా, తెలంగాణ తాము సంకల్పించిన ఎత్తిపోతల ప్రాజెక్టులకు బ్రేకులు పడడంతో.. తెలంగాణ కాస్త అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఏపీలోనూ రాయలసీమకు అంతో ఇంతో నీళ్లు ఇస్తానంటున్న చంద్రబాబు సంకల్పం ఏమాత్రం నెరవేరాలన్నా కృష్ణా కేటాయింపులే తప్ప దిక్కు లేదు. ఈ నేపథ్యంలో.. కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకునే సమయం దగ్గర పడుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలో పట్టి సీమ ప్రాజెక్టును కూడా ప్రస్తావిస్తూ.. దాని ద్వారా ఏపీకి మిగిలే నీళ్లన్నిటినీ పరిగణించి కొత్త కేటాయింపులు చేయాలని వాదిస్తోంది. అయితే వీరి వాదన బోర్డు ముందు సహేతుకమైనదిగా నిలుస్తుందో లేదో తెలియడం లేదు.
ఎందుకంటే నదీ జలాలకు చివరిభాగంలో ఉన్న రాష్ట్రం మిగులు జలాలను వాడుకోవడంలో కేటాయింపుల ప్రసక్తి ఉండదు. ఆ ఉద్దేశంతోనే గోదావరి మిగులు జలాలు సముద్రం పాలు కాకుండా పోలవరం గానీ, పట్టిసీమ గానీ ప్లాన్ చేశారు. అయితే ఆ పట్టిసీమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ కోరుతున్నది. ఆ జలాలను కూడా పరిగణిస్తే తమకు 74 టీఎంసీలు, ఏపీకి 56 టీఎంసీలు మాత్రమే వస్తాయని బోర్డుకు తెలంగాణ నీటిపారుదల అధికారులు ఓ నివేదిక కూడా ఇచ్చారు.
అయితే తమ వాదన బోర్డు ముందు నిలబడుతుందో లేదో వారికే సందేహం ఉన్నట్లుంది. అందువల్ల.. ఒకవేళ పట్టిసీమను పరిగణనలోకి తీసుకోకపోతే.. అంటూ మరో ఆప్షన్ కూడా సూచిస్తున్నారు. అలాగైతే తమకు 56, ఏపీకి 74 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందని వీరు సూచిస్తున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ తమకు కేటాయించిన దానికంటె ఎక్కవ నీటిని వాడేసుకున్నదనే ఆరోపణలు కూడా తెలంగాణ చేస్తున్నది.
మొత్తానికి కృష్ణా జలాల వివాదం త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బోర్డు సభ్య కార్యదర్శి ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్ లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయతే కొత్తగా కేటాయింపులను నిగ్గు తేల్చే ముందు పట్టిసీమను కూడా పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరమైన చర్చగా ఉంది. పట్టిసీమను చూపించి.. తెలంగాణకు నీటి కేటాయింపులను తాము చెబుతున్నట్లుగా 74 టీఎంసీల వరకు పెంచడం కేసీఆర్ సర్కారుకు సాధ్యమేనా అని కూడా పలువురు తర్కిస్తున్నారు.

