నోరు జారిన వైనం కోడెల మెడకు చుట్టుకుంది!

టీవీ ఛానెళ్లలో పాయింట్‌బ్లాంక్ వంటి ఇంటర్వ్యూల జోరు పెరిగిన తర్వాత.. నాయకులు సమాధానాలు చెప్పే దూకుడులో కొన్ని సార్లు తమంత తామే ఇరుక్కుపోతున్నారు. తమ వ్యాఖ్యలకు తామే జవాబుదారీగా మారే పరిస్థితి వారికి ఎదురవుతోంది. ఇప్పుడు అలాంటి సంకటమే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కూడా తప్పడం లేదు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో గతంలో మాట్లాడుతూ తనకు గత ఎన్నికల ఖర్చు 11.5 కోట్ల రూపాయలు అయిందంటూ కోడెల (ఆన్ రికార్డ్) చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి.
ఈ విషయంలో ఆయన ఎన్నికల ఖర్చు గురించిన వివరాలు సేకరించడానికి కేంద్ర హోంశాఖ ఆరాలు తీస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం పైకి కనిపించినంత సులువుగా తేలేలా లేదు. స్పీకరు కోడెలకు ఇబ్బంది తప్పకపోవచ్చునని కూడా పలువురు అంటున్నారు.
వివరాల్లోకి వెళితే..
2014 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అక్కడ వైకాపాకు చెందిన అంబటి రాంబాబు మీద స్వల్ప ఆధిక్యంతో ఆయన నెగ్గారు. అయితే కొంత కాలం కిందట ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలకు తనకు 11.5 కోట్లు ఖర్చయిందని చెప్పారు. ఆయన స్వయంగా చెప్పినందున నిబంధనలు ఉల్లంఘించినట్లే అంటూ అలెగ్జాండర్ అనే న్యాయవాది ఈ అంశాన్ని లేవనెత్తారు.
ఆయన రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘాలకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ ఫిర్యాదును పరిశీలించి... దానికి సంబంధించిన సమాచారాన్ని పిటిషనర్‌కు తెలియజేయాలంటూ.. ఏపీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ టక్కర్‌ను ఆదేశిస్తూ హోంశాఖ లేఖ రాసింది. కాబట్టి.. టీవీ ఇంటర్వ్యూలో నోరు జారిని పాపానికి కోడెల ఇప్పుడు స్వయంగా సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తోంది. ఆ సంజాయిషీ ఎన్నికల సంఘం వద్ద కూడా ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.

