నోట్ల రద్దును తోసిరాజన్న బెంగాల్ అసెంబ్లీ!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తన పట్టుదలను మరోసారి ప్రదర్శించారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో ఉద్యమాన్ని నడిపించడమూ, ప్రతిపక్షాలను కూడగట్టి తమ సభ్యులతోనూ కలసి పార్లమెంటును ప్రతిరోజూ స్తంభింపజేయడం మాత్రమే కాకుండా.. తమ పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ తీర్మానం కూడా చేశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానంలో పేర్కొనడం విశేషం.
అయితే నోట్ల రద్దు విషయంలో విపక్షాల మధ్య ఉన్న అనైక్యత బెంగాల్ అసెంబ్లీలో మరోమారు బయల్పడింది. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ, ఆ నిర్ణయం వెనక్కు తీసుకోవాలూం తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. పార్లమెంటులో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నప్పటికీ.. ఇక్కడ అధికార పార్టీ బిల్లును కాంగ్రెస్, వామపక్షాలు సమర్థించకపోవడం గమనార్హం. నోట్ల రద్దును వ్యతిరేకించడం వరకు ఓకే గానీ, ఆ నిర్ణయం వెనక్కు తీసుకోవాలనే దానికి తాము మద్దతివ్వలేమని ఆ పార్టీలు పేర్కొన్నాయి. నిర్ణయం వెనక్కు తీసుకోవాలని మేం కోరలేం.. ఎందుకంటే అది ఆర్థిక వ్యవస్థలో మరింత పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది అని అక్కడి విపక్షనేత వ్యాఖ్యానించారు.
బిల్లును ప్రవేశపెట్టిన పాలకపక్షం మాత్రం , తాము నల్లధనానికి వ్యతిరేకమే గానీ.. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా.. దాన్ని ప్రవేశపెట్టిన తీరు సరికాదని వ్యాఖ్యానించింది.
అయితే ఈ పరిణామాల మీద బెంగాల్ లోని భాజపా నాయకులు తేలిగ్గానే స్పందిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ తీర్మానాన్ని వారు కొట్టి పారేస్తున్నారు. నల్లధనంలో పీకల్లోతు కూరుకుపోయి ఉన్న వారికి మోదీ నిర్ణయం గురించి మాట్లాడే హక్కు లేదంటూ... వారు పైకి బింకంగానే సమాధానమిస్తున్నారు.

