నోట్ల రద్దు దెబ్బ : ఆమెజాన్ పంట పండింది!

పిల్లికి చెలగాటం.. ఎలక్కి ప్రాణసంకటం అంటే అచ్చంగా కాదు గానీ.. ఇంచుమించుగా ఇదే.
నోట్ల రద్దు దెబ్బకు దేశవ్యాప్తంగా సామాన్యుడు విలవిల్లాడిపోతోంటే.. ప్రఖ్యాత్ ఆన్ లైన్ స్టోర్ ఆమెజాన్ మాత్రం పండగ చేసుకుంటోంది. నోట్ల రద్దు తర్వాత వారి వ్యాపారంలో రికార్డు స్థాయిలో మూడంకెల వృద్ధి కనిపిస్తోందిట. దానికి తోడు ఆమెజాన్ ఎలక్ట్రానిక్ చెల్లింపుల్లో కూడా వేర్వేరు పద్ధతులను అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారట... ఈ విషయాన్ని ఆమెజాన్ వైస్ ప్రెసిడెంట్ , కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ స్వయంగా ప్రకటించారు.
ప్రధాని మోదీ నోట్ల రద్దును ప్రకటించిన వెంటనే ఆమెజాన్ ఓ చర్య తీసుకుంది. డెలివరీ అయిన తర్వాత నగదు చెల్లించే పద్ధతిని రెండు రోజులు ఆపేసింది. తద్వారా తమ వినియోగదారులకు మరింత ప్రయోజనం కలిగేలా.. తమ లాజిస్టిక్స్ బృందాలు ఒక తరహా లావాదేవీల ప్రపంచం నుంచి, మరో తరహాకు మారడానికి సమయం తీసుకున్నాం అని ఆయన ప్రకటించారు. ఇది మెరుగైన ఫలితాలు ఇచ్చిందని అమిత్ అగర్వాల్ ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
డెలివరీ తర్వాత చెల్లించదలచుకున్న కస్టమర్లు.. తమ ఇంటి వద్దనే నగదుకు బదులుగా కార్డు ద్వారా చెల్లించే ఏర్పాట్లు చేసినట్లుగా ఆమెజాన్ ప్రకటించింది. లాజిస్టిక్స్ బృందాల వారు ఈపోస్ మెషిన్లతో ఇంటి వద్దకు వస్తుండడం అందరికీ సౌకర్యమే. దీంతో తమ కస్టమర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం పదిరెట్లు పెరిగిందని ఆయన చెప్పారు. ఈ-ఆర్థిక లావాదేవీలు ఎప్పటికీ మంచిదే అని వ్యాఖ్యానిస్తూ.. తమ వ్యాపారం సాధారణ స్థితికి చేరుకున్నదని, ఏటా మూడంకెల వృద్ధి కనిపిస్తున్నదని అమిత్ వెల్లడించారు.
మొత్తానికి ఒకవైపు నోటు కష్టాలు ప్రజలు పడుతోంటే.. డిజిటల్ ఆర్థిక యుగాన్ని ఆవిష్కరించే దిశగా.. ఇంటర్నెట్ లోని విక్రయసంస్థలు పెద్దస్థాయిలో బిజినెస్ చేస్తున్నాయన్నమాట.

