నోటుదెబ్బలో ఊరట : బ్యాంకుల సెలవుల రద్దు!

500, 1000 నోట్ల నిషేధం పర్యవసానంగా అనేక రకాల ఇబ్బందులు జనానికి ఎదురవుతున్నాయి. ప్రజలకు కొన్ని ఇబ్బందులు తప్పవు అని మోదీ ముందే హెచ్చరించారు గానీ.. నిజానికి అనూహ్యమైన అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఉదాహరణకు ప్రాక్టికల్ గా ఆచరణలోకి వచ్చిన తర్వాత గానీ.. టోలగేట్ ల వద్ద సమస్య ఎంతటిదో అర్థం కాలేదు. టోల్ టాక్సులను ప్రభుత్వం మూడు రోజుల వరకు రద్దుచేసింది. అలాంటి అనూహ్యమైన ఇబ్బందులు ఎన్నో ఎదురవుతున్నాయి. బ్యాంకుల విషయంలోనే.. 11వ తేదీ తర్వాత.. వరుస సెలవులు వస్తున్నాయి కదా , నగదు మార్చుకోవడం ఇబ్బంది అవుతుందేమోనని అందరూ ఆందోళన చెందిన నేపథ్యంలో కేంద్రం కాస్త ఊరట కల్పించింది. 12, 13 శని , ఆదివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయని.. ప్రజలు ఇబ్బంది లేకుండా కార్యకలాపాలు చేయవచ్చునని పేర్కొన్నది. నిజానికి ప్రజలకు ఆ రెండు రోజులు బ్యాంకులు పనిచేయడం అనేది చాలా పెద్ద ఊరటగా చెప్పుకోవాలి. 14వ తేదీ గురునానక్ జయంతి సందర్భంగా సెలవుగానే ఉంటుంది.
అలాగే అనూహ్యమైన ఇబ్బందుల్లో భాగంగా.. సినిమాల టికెట్లకు చిల్లర దొరక్క ప్రదర్శనలు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. సినిమాల విడుదలలు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. చాలా మంది ప్రజలు ఇంట్లో ఉన్న నల్లధనాన్ని బంగారాం మార్చుకోవడానికి తొందరపడుతున్నారు. బంగారం ధర అనధికారికంగా అమాంతం పెంచేశారు. రకరకాల పేర్లతో రసీదులు ఇస్తూ.. బంగారం విక్రయాలు సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అలాగే రేపు బ్యాంకులు తెరవగానే జనం రద్దీ విపరీతంగా ఉండి బ్యాంకుల వద్ద తొక్కిసలాట ఏర్పడుతుందనే ఉద్దేశంతో అన్ని బ్యాంకుల వద్ద భారీ గా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడానికి కూడా డీజీపీ ముందే సన్నాహాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అధికార్లను ఆదేశించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కసారిగా చిల్లర నోట్లకు కొరత రావడంతో.. దళారులు విజృంభించి వ్యాపారాలు చేస్తున్నారు. కమిషన్లు తీసుకుని 500 నోట్లకు కొంత కమిషన్ తీసుకుని చిల్లర ఇవ్వడం జరుగుతోంది.
కాగా 500 నోట్లు రద్దు కాదని, కేవలం నోట్ల మార్పిడి మాత్రమేనని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. రేపటినుంచి బ్యాంకుల్లో కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొంటున్నారు.

