నోటు దెబ్బేనా? : ఈ ఉప్పు గొడవ ఏంట్రా బాబూ!

అవునుగానీ, రహస్య అరల్లో మూలుగుతూ ఉండే నల్లధనం పెద్దనోట్లకు.. వంటింట్లో ఉప్పు చెలామణీ అయ్యే ‘ఉప్పు’ ధరకు సంబంధం ఏమిటీ? ఇదేదో బాదరాయణ సంబంధం లాగా, మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టినట్లుగా ఉన్నది కదా? అని మనకు అనిపిస్తుంది. ఎవరికి ఎలా అనిపిస్తుందనే విషయంతో నిమిత్తం లేదు. ‘‘మొత్తానికి పెద్దనోట్ల రద్దు వలన’’ అనే కారణం చేత అని చెబుతూ.. ఉప్పు ధర అమాంతం పెరిగిపోయింది. కారణాలు ఏవైనప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో వైరల్ గా వ్యాపించిన పుకార్ల పుణ్యమాని ఉప్పు ధర అమాంతంగా పెరిగిపోయిన మాట వాస్తవం.
బీహార్ లో ఒక దశలో కిలో ఉప్పు 70 రూపాయలకు అమ్ముడుపోయింది. ఉత్తరప్రదేశ్ లో పుకార్లు ముమ్మరంగా రావడంతో.. కిలో ఉప్పు ధర 250 రూపాయలకు వెళ్లిపోయింది. వ్యాపారులు ఉప్పును బ్లాక్ చేసేయడం మొదలైంది. పరిస్థితి అదుపుతప్పుతోందని గ్రహించిన ప్రభుత్వం ఒక్కసారిగా.. జోక్యం చేసుకుని అధికారులతో దాడులు చేయించి.. ఉప్పును బ్లాక్ చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పుధర పెరిగిందనే పుకార్లు నమ్మవద్దని, స్టాకు లేదని వస్తున్న పుకార్లు నిజం కాదని, ప్రజలు అధికధరలకు ఉప్పు కొనవద్దని ప్రచారం చేసి.. పరిస్థితి అదుపులోకి తేవడానికి ప్రయత్నించింది.
శనివారం తెల్లవారే సమయానికి హైదరాబాదులోని బోరబండలో కూడా కిలో ఉప్పు 300 రూపాయలకు అమ్ముడవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉప్పు దొరకడం లేదు అనే వార్తలు వ్యాపించడంతో ఇలా హఠాత్తుగా బ్లాక్ మార్కెట్ ధర పెరిగిపోయింది. వాస్తవాల గురించి సరైన అవగాహన లేని ప్రజలు ఉప్పు ఇక దొరకదేమో అనే భయంతో ఎగబడి కొనుక్కుంటూ ఉన్నారు. మరోవైపు హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ కూడా ఉప్పును బ్లాక్ మార్కెట్ కు ఎవరైనా తరలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరిస్తున్నారు. ఉప్పు ధర పెరిగిందనే వదంతులను నమ్మవద్దంటూ పోలీసు కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం కిలో ఉప్పు 300 రూపాయల ధర పలుకుతూ ఉండగా, ముందు ముందు కిలో 600 రూపాయలకు ధర చేరుతుందంటూ ప్రచారం జరుగుతోంది.
ఎందుకిలా..?
అయితే ఎందుకిలా జరుగుతోంది. హఠాత్తుగా ఉప్పు ధర ఎందుకు పెరిగింది? అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. దేశంలో ప్రస్తుతం పెద్దనోట్ల వ్యవహారం ఒక్కటే హాట్ గా నడుస్తున్నది గనుక.. ఆ నోట్ల రద్దు నేపథ్యానికి దీనికి లింకు ఉన్నదని కొందరు అంటున్నారు. మరికొందరు వాతావరణంలో వచ్చిన మార్పులు, చలి తీవ్రత పెరగడం నేపథ్యంలో ముడిఉప్పు లభ్యత తగ్గిపోయిందని.. ఉప్పు తయారీ తగ్గుతుందని కొన్ని నెలల పాటూ ఉప్పునకు కొరత ఏర్పడుతుందని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఉప్పు మీద పన్నులే ఉండరాదని, ఉప్పు ఉచితంగా స్వేచ్ఛగా పొందడం ఈ దేశ ప్రజల హక్కు అనే నినాదాలతో సత్యాగ్రహాలు జరిగిన ఈ దేశంలో కిలో ఉప్ప ధర 300 నుంచి 600 రూపాయల దిశగా పరుగులు తీస్తూ ఉండడం మాత్రం చిత్రమైన సంగతి.

