నేను వదలంటున్న రాహుల్...!

గుజరాత్ లో ఓటమిపాలయినా రాహుల్ ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లుంది. గుజరాత్ ఫలితాలు పూర్తిగా పార్టీలోనూ, రాహుల్ లోనూ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులకు గుజరాత్ ఎన్నికల ఫలితాలు బూస్ట్ నిచ్చాయి. దీంతో రాహుల్ గాంధీ నేటి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సమావేశాలు... సమీక్షలు...
అంతేకాకుండా ఇటీవల కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యులతో భేటీ కానున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేత ఎవరనేది ఈభేటీలో తేలిపోనుంది. అంతేకాకుండా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ నుంచే ఎక్కువ సీట్లు సాధించాలన్నది రాహుల్ లక్ష్యంగా కన్పిస్తుంది. ఊహించని విధంగా సీట్లు రావడం, చివరి నిమిషం వరకూ పోరు నువ్వా? నేనా? అన్నట్లు మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే ఉండటంతో ఆయన ఫుల్ జోష్ మీదున్నారు.
అధ్యక్షుడి హోదాలో....
ఈరోజు గుజరాత్ చేరుకోగానే సోమనాధ్ ఆలయాన్ని దర్శించారు. అక్కడ పూజలు చేశారు. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ ఈ ఆలయాన్ని సందర్శించారు. దీంతో పాటు పార్టీ కార్యకర్తలతోనూ రాహుల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ పరంగా జరిగిన లోపాలను ఆయన కార్యకర్తల నుంచి అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ లో ఓటమిపాలయినప్పటికీ ఇక్కడి ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ఉంటానని చెప్పటానికే రాహుల్ మూడు రోజుల పర్యటనకు వచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గుజరాత్ రావడంతో కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
- Tags
- రాహుల్

