నేడు బెజవాడలో ఏం జరుగుతుందో?

ఏపీ అసెంబ్లీ ని ముట్టడించేందుకు ఈరోజు ఏపీ ప్రత్యేక హోదా సమతి రెడీ అయింది. కేంద్రం విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను కేంద్రప్రభుత్వంలో ఉన్న బీజేపీ పక్కన పెట్టింది. ఇటు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తెలుగుదేశం కూడా పట్టించుకోవడం లేదు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకే టీడీపీ కూడా తలూపింది. అయితే విభజన హామీలన్ని అమలు పర్చాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి, విభజన హామీల సాధన సమితి సంయుక్తంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే... విభజన హామీలు అమలు పర్చకుండా బీజేపీ మోసం చేస్తుందని సమితి నేతలు ఆరోపిస్తున్నారు.
అసెంబ్లీ ముట్టడికి....
ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించారు. విభజన హామీలు ముగిసిన అధ్యాయం కాదని అన్ని పార్టీల నేతలూ గుర్తుంచుకోవాలని సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ ముట్టడికి హోదా సాధన సమితితో పాటు లోక్ సత్తా, వామపక్ష పార్టీలు చేతులు కలుపుతున్నాయి. జనసేన నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలాగే వైసీపీ కూడా దీనిపై స్పష్టత తెలియజేయలేదు. అయితే ఏ పార్టీ తమకు అండగా లేక పోయినా విద్యార్థి, ఉద్యోగ, ప్రజాసంఘాలతో కలిపి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామని సమితి నేతలు చెబుతున్నారు. ఏయూ, ఎస్వీ, నాగార్జున యూనివర్సిటీల నుంచి కొందరు విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొంటారన్న ఇంటలిజెన్స్ సమాచారం రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
- Tags
- ఏపీ ప్రత్యేకహోదా

