నేడు జగన్ పాదయాత్ర చేయరట...!

వైసీపీ అధినేత జగన్ ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. పాదయాత్రకు ఒకరోజు విరామం ప్రకటించనున్నారు. దీంతో నిన్న రాత్రే జగన్ పాదయాత్ర ముగించుకుని అనంతపురం జిల్లా నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. గార్లదిన్నె మండలం బాపినేలపాలెంలో పాదయాత్రకు విరామం ప్రకటించారు. జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. గత శుక్రవారం కోర్టుకు సెలవు కావడంతో ఆయన హాజరు కాలేదు. ఈ శుక్రవారం ఆయన సీబీఐ కోర్టులో విచారణకు హాజరుకావాల్సి రావడంతో రోడ్డు మార్గం ద్వారా జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం వరకూ జగన్ హైదరాబాద్ లోనే ఉంటారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన తిరిగి పాదయాత్ర స్థలానికి చేరుకుంటారు. శనివారం నుంచి యధాతధంగా పాదయాత్ర కొనసాగుతుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
అనంతలో మంచి రెస్పాన్స్.....
నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన జగన్ పాదయాత్ర నిన్నటికి 29వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లాలో ఆయన 250 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు ఊహించిన దానికన్నా రెస్సాన్స్ రావడంతో జగన్ పార్టీలో జోష్ నెలకొంది. పాదయాత్రకు పెద్దయెత్తున జనం తరలి వస్తుండటంతో ఆయన నిన్ననే 400 కిలోమీటర్ల మైలు రాయిని కూడా దాటేశారు. అనంతపురం జిల్లాలో నాలుగు రోజులు మాత్రమే జగన్ పర్యటించారు. దాదాపు ఇరవై రోజులకు పైగానే ఈ జిల్లాలో పాదయాత్ర కొనసాగనుంది. వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలను వింటూ..వారికి భరోసా కల్పిస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సి రావడంతో యాత్రకు వారం వారం బ్రేకులు తప్పడం లేదు. అనంతపురం జిల్లా మారుమూల గ్రామాల్లో ఉన్న జగన్ హైదరాబాద్ రావడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది.
- Tags
- జగన్

