నిజాల నిగ్గు తేల్చేస్తాం....!

ఏది అబద్ధం? ఏది నిజం? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తొలిరోజు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ బాధ్యతగల పౌరులుగా ఈ కమిటీని వేశామన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇటు టీడీపీ, అటు బీజేపీ కూడా రాష్ట్రానికి ఎంత వచ్చాయో? ఎంత ఇచ్చారో తెలియజెప్పడం లేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న బాధ అందరిలో ఉందన్నారు. దేశ సమగ్రతకు భంగం కలగకుండా పోరాటం చేయాలన్నారు. ఆవేశంతో పనులు జరగవని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు ఏమేరకు అమలయ్యాయి? ప్రధాని సభలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అనే దానిపై కమిటీ ఈరోజు చర్చిందన్నారు. ప్రధాని ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి పడుతుందన్నారు. ఎంతిచ్చారన్నదే కాని...ఎక్కడ ఖర్చు చేశారన్నది ఫెడరల్ వ్యవస్థలో ప్రశ్నించకూడదన్నారు. ఏపీ సర్కార్ లెక్కలు పంపిస్తామని చెప్పింది. ఈరోజు సాయంత్రానికి పవన్ కల్యాణ్ ఆఫీస్ కు వచ్చే అవకాశముందని జేపీ చెప్పారు. కేంద్రం నుంచి కూడా లెక్కలు వస్తే బాగుంటుందన్నారు.
సాంకేతిక అంశాలు తేల్చేందుకు.....
మాజీ హోం శాఖ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ రావులతో కమిటీని నియమించామని, ఈ కమిటీ సాంకేతికంగా అథ్యయనం చేస్తుందని చెప్పారు. మిగిలిన పార్టీలూ కూడా ఇందులో భాగస్వామ్యులు కావాలని జేపీ సూచించారు. రెవెన్యూ లోటు, వెనకబడ్డ ప్రాంతాలు, పోలవరం, పన్నుల రాయితీలు, విద్య, ఆరోగ్య సంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, ఓడరేవుల నిర్మాణం, రైల్వే జోన్, ప్రత్యేక ప్రతిపత్తి, రాజధాని నిర్మాణం కోసం ఏర్పాట్లపై రేపు చర్చ జరుగుతుందన్నారు. ఈ మొత్తం కార్యక్రమం వారాల్లో పూర్తి కావాలని జయప్రకాశ్ ఆకాంక్షించారు. రోజులు, వారాల్లో ఈ కార్యక్రమం పూర్తిచేసి కార్యచరణను ప్రకటిస్తామని చెప్పారు.
- Tags
- పవన్ కల్యాణ్

