నారా వారి కుటుంబం.... ఎంత హ్యాపీగా...!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తన స్వగ్రామంలో బంధుమిత్రుల మధ్య సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. శనివారం చిత్తూరు జిల్లా నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు కుటుంబం ఈరోజు కూడా నారావారపల్లెలోనే సంక్రాంతి వేడుకలను జరుపుకుంటోంది. కుటుంబ సభ్యులతో పాటు బావమరిది బాలయ్య బాబు కూడా నారావారిపల్లెకు వచ్చారు. మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన మొత్తం నారావారి పల్లె నుంచే జరుగుతోంది. చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ తో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
బంధుమిత్రులతో ఉల్లాసంగా....ఉత్సాహంగా...
శనివారం నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు బంధుమిత్రులతో ఉల్లాసంగా గడిపారు. తన వ్యాపార సామ్రాజ్యమైన హెరిటేజ్ ఫ్యాక్టరీని ఆయన దర్శించారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ లాభాల బాటలో పయనించడానికి ఇక్కడ కార్మికుల వల్లనేనని ఆయన అన్నారు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఆయన హెరిటేజ్ ఫ్యాక్టరీకి రావడంతో సిబ్బంది మొత్తం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. హెరిటేజ్ ఫ్యాక్టరీని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చూసుకుంటున్నారు.
పాలన మొత్తం అక్కడి నుంచే....
ఆదివారం చంద్రబాబు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈరోజు కనుమ సందర్భంగా నారావారిపల్లెలోనే చంద్రబాబు గడపనున్నారు. గ్రామస్థులందరూ చంద్రబాబు వద్దకు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించారు. మరికొన్ని పనులను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం నారావారిపల్లెలోనే ఉండటంతో అధికార యంత్రాంగం మొత్తం అక్కడే ఉంది. పాలన వ్యవహారాలను చంద్రబాబు అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. సీఎం కుటుంబం నారావారిపల్లె చేరుకోవడంతో పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం తిరిగి అమరావతి బయలుదేరనున్నారు.

