నాగం పార్టీని ఈయన లాగేసుకుంటున్నారా?

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ పెట్టాలంటే రిజిస్ట్రేషన్ వంటివి ఆలస్యం అవుతాయని భావించిన ప్రొఫెసర్ కోదండరామ్ బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డిని సంప్రదించినట్లు తెలుస్తోంది. నాగం జనార్ధన్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ నగరా సమితి అని పెట్టారు. నాగం తెలంగాణ సకల జనుల పార్టీ అని అప్పట్లో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అయితే ఆ తర్వాత నాగం బీజేపీలో చేరిపోయారు. నాగం రిజిస్ట్రేషన్ చేయించిన తెలంగాణ సకలజనుల పార్టీ రెడీ గా ఉండటంతో ఆ పార్టీ మీద జేఏసీ పోటీ చేయాలని భావిస్తుంది. ఈ మేరకు కోదండరామ్ కొద్దిరోజుల క్రితం నాగం జనార్ధన్ రెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
కొత్త పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా.....
నాగం జనార్ధన్ రెడ్డి కూడా బీజేపీలో ఇమడ లేకపోతున్నారు. ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. నాగం దీనిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నప్పటికీ బీజేపీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని భావిస్తున్నారు. అందుకోసం కోదండరామ్ పెట్టే పార్టీలో చేరాలా? లేక కాంగ్రెస్ లోకి వెళ్లిపోవాలా? అన్న విషయాన్ని నాగం ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. కోదండరామ్ ఇప్పటికే తమ పార్టీలోకి రావాల్సిందిగా నాగంను ఆహ్వానించారు. అలాగే సకలజనుల పార్టీని కూడా తమకు ఇవ్వాలని కోరారు. నాగం ఈమేరకు కొంత అంగీకరించినట్లు తెలిసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండాలని కూడా కోదండరామ్ నాగంను కోరినట్లు చెబుతున్నారు. ఒకవేళ ప్రొఫెసర్ కొత్త పార్టీ పెట్టినప్పటికీ కాంగ్రెస్ తో పొత్తుతోనే కలిసి వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అందుకోసం నాగం జనార్థన్ రెడ్డి ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు తెలుస్తోంది. చూడాలి. ఏం జరుగుతుందో.....!

