నల్లగొండ ను రేవంత్ ఖాళీ చేసేస్తారా?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీని వీడటం దాదాపు ఖాయమైపోయిందనే చెప్పాలి. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తమే ఖరారు కావాల్సి ఉంది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రేవంత్ రెడ్డి వెంట కొందరు టీడీపీ నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశముంది. దీంతో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నల్లగొండ జిల్లా నేతలతో ఫోన్ లో మాట్లాడి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలోనూ రేవంత్ కు కొందరు ముఖ్యమైన అనుచరులున్నారు. ఇందులో ప్రధానంగా నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల భూపాలరెడ్డి ఒకరు. ఆయన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి. ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్ రెడ్డి. గత ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంల నుంచి పోటీచేసి ఓడిపోయిన పటేల్ రమేష్ రెడ్డి కూడా రేవంత్ వెంట వెళ్లే వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం.
ఆపేందుకు మోత్కుపల్లి ప్రయత్నాలు......
అయితే వీరందరికీ నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ తరుపున టిక్కెట్లు దక్కడం కష్టమే. ఉమామాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి యాదాద్రి జిల్లా టీడీపీ కన్వీనర్ గా ఉన్నారు. ఆయన భువనగిరి టిక్కెట్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక సూర్యపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన పటేల్ రమేష్ రెడ్డికి టిక్కెట్ కష్టమే. అక్కడ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముచ్చెమటలు పట్టించిన కంచర్ల భూపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈయనకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాదని నల్లగొండ అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తి లేదు. ఇక కంచర్ల కృష్ణారెడ్డి ప్రస్తుతం మునుగోడు టీడీపీ లీడర్ గా ఉన్నారు. ఆయన రేవంత్ వెంట వెళ్లినా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే మునుగోడుకు కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా దివంగత మాజీ రాజ్యసభసభ్యులు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ఉన్నారు. దీంతో వీరు రేవంత్ తో పాటు కాంగ్రెస్ లోకి వెళ్లినా ఫలితం లేదని తెలుస్తోంది. వీరిలో ఉమా మాధవరెడ్డి కుటుంబానికే ఒక టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయి. దీంతో ఈ విషయాన్ని వారికి మోత్కుపల్లి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ వెంట నల్లగొండ జిల్లా నుంచి ఎవరూ వెళ్లకుండా మోత్కుపల్లి కసరత్తులు చేస్తున్నారు. అయితే రేవంత్ వెంట వీరిలో కొందరు వెళ్లడం ఖాయమంటున్నారు.
- Tags
- నల్లగొండ రేవంత్

