నంద్యాల ఓట్ల కోసం చెప్పి...బాబు ఏం చేశారంటే?

ఎన్నికలొస్తే హామీలు గుప్పించడం మామూలే. అయితే ఆ హామీని నెరవేర్చినవారే నేతగా ఎదుగుతారు. అయితే ఇటీవల కాలంలో రాజీకీయాల్లో హామీలు సర్వ సాధారణమయి పోయాయి. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఏ మాత్రం తర్వాత పట్టిచుకోక పోవడం రాజకీయనేతలకు అలవాటుగా మారింది. ఎన్నికల వేళ లబ్ది పొందేందుకు అలివికాని హామీలు ఇచ్చిన వారు పోలింగ్ ముగియగానే పక్కకు తప్పుకోవడం ఇటీవల సహజమయింది. నంద్యాల ఉప ఎన్నిక అందరికీ తెలిసిందే కాదా? నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం, వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి హామీల మాటేమిటి? నంద్యాల సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏదీ?
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రెండు పార్టీలూ కులాల వారీగా మీటింగ్ లు పెట్టారు. బోలెడు వరాలు కురిపించారు. ప్రతి కులానికి ఏదో ఒక హామీని ఇచ్చారు. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల్లో పట్టణంలో ఉన్న ఆర్యవైశ్యుల ఓట్లు పొందడానికి ఇటు చంద్రబాబు, అటు జగన్ఇద్దరూ హామీలు గుప్పించారు. అయితే జగన్ పార్టీ ఓటమి పాలు కావడంతో ఆయనను ప్రస్తుతానికి ఏమీ అనలేం. కాని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వారి ఓట్లు గంపగుత్తగా పొందేందుకు పెద్ద హామీనే ఇచ్చారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని, ఈ నిధుల ద్వారా రుణాలు పొంది చిన్న వర్తకులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చని కూడా వారికి ఆశలు గుప్పించారు.
13 జిల్లాల్లో నిరసనలు....
అయితే నంద్యాల ఉప ఎన్నిక అయిపోయి దాదాపు నాలుగు నెలల పైనే కావస్తుంది. కాని ఆ హామీ ఇంతవరకూ నెరవేరలేదు. ఆర్య వైశ్య కార్పొరేషన్ ప్రతిపాదన మంత్రివర్గ సమావేశంలోనూ రాలేదు. అయితే దీనిపై ఆర్యవైశ్య సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని 13 జిల్లాల్లో ఆందోళనకు దిగుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వారు ఆర్యవైశ్యుల్లోనూ ఉన్నారని, వారిని ఆదుకునేందుకు వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటున్నారు. నంద్యాల ఉఫ ఎన్నిక అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి దానిని పట్టించుకోకపోవడాన్ని పలువురు ఆర్యవైశ్యులు తప్పుపడుతున్నారు. అయితే ఎన్నికల ముందు దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
- Tags
- చంద్రబాబు

