ధర్నాకు దిగుతున్న జగన్ : లాభమెంత? నష్టమెంత?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకూ ఆరోగ్య శ్రీ చికిత్సలు జరుగుతున్నాయా లేదా? నిరుపేదల ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే.. వారిని యాజమాన్యాలు గెంటేస్తున్నాయా? బిల్లులు రావడం లేదు గనుక.. వైద్యం చేయం పొమ్మని తరిమేస్తున్నాయా? అలాంటి సంఘటనలు ఏవీ మీడియాలో రిపోర్ట్ కావడం లేదేమిటి? అనే సందేహాలు మనకు కలగడం సహజం. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే.. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి చికిత్సలు నిరాకరించిన సందర్భాలు ఏవీ నమోదు కావడం లేదు. అంటే ఆస్పత్రికి బిల్లులు సకాలంలో వస్తున్నాయా? లేదా? అనేదానితో నిమిత్తం లేకుండా పేదలకు చికిత్స అందుతోంది. పేదలకు ఆరోగ్యశ్రీ ఉన్నదంటే చాలు.. కార్పొరేట్ ఆస్పత్రులు కళ్లద్దుకుని వారిని అడ్మిట్ చేసుకుని ఐసీయూల్లో పెట్టేసుకుంటున్నాయి. కాస్త ముందువెనుకగా అయినా లక్షలు దండుకోవచ్చునని అనుకుంటున్నాయి. అలాంటప్పుడు చికిత్సలు ఎక్కడా ఆగడం లేదు. నిధులు జాప్యం అవుతున్నాయనే సమస్య.. సామాన్యుడి మీద ‘నేరుగా’ ప్రభావం చూపడం లేదు. అలాంటి నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం లేని ఒక సమస్యను తీసుకుని, రాష్ట్రవ్యాప్తంగా పెద్దస్థాయిలో ఆందోళనలు చేసినంత మాత్రాన జగన్ కు ఏం ఒరుగుతుంది? ఇది వారే తర్కించుకోవాల్సిన విషయం. జగన్ కు చేదుగా అనిపించే వాస్తవం.
ఆరోగ్యశ్రీకి నిదులు విడుదల కావడం లేదంటూ వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఏపీ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ధర్నాలను నిర్వహిస్తున్నది. ఒంగోలు జరిగే ధర్నాలో జగన్ స్వయంగా పాల్గొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా ఆశలున్న నాయకులు పుష్కలంగానే ఉన్నారు గనుక.. జనాన్ని బాగానే పోగేస్తారు.. ధర్నాలు బాగానే జరుగుతాయి. కానీ ఇది ప్రజల్లో జగన్ కు ఆదరణ పెంచే కార్యక్రమమేనా? పైన చెప్పుకున్నట్టు చికిత్సలు ఆగిపోనంత వరకు, ఆస్పత్రులకు నిధులు ఎప్పుడు వచ్చినా సామాన్యుడికి దాని గురించి పట్టదు.
ఏతావతా.. వైఎస్ జగన్మోహన రెడ్డి.. సామాన్యులకోసం కాకుండా.. కార్పొరేట్ ఆస్పత్రులకోసం ధర్నా చేస్తున్నట్లుగా ఈ వ్యవహారం రంగు పులుముకుంటుంది. రాజకీయ వైరి పక్షాలు అలాంటి నిందలు వేస్తే జగన్ ఎలాంటి సమాధానం చెబుతారు? జగన్ ఆరోగ్యశ్రీ నిధుల విడుదల గురించి సీఎంకు లేఖ కూడా రాశారు. ఆ తర్వాత ఈ ధర్నాలు ప్లాన్ చేశారు.
అయితే.. ఆస్పత్రులకు నిధుల విడుదల కోసం ధర్నా కాకుండా.. కనీసం ఈ పాటి ఫోకస్ ఫీజు ఇతర ప్రజాసమస్యలమీద పెట్టి ఉంటే.. ఫీజు రీఇంబర్స్ మెంట్ బకాయిల మీద పెడితే.. ఖచ్చితంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చి ఉండేదని ఆయన పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

