‘దేవుడికరుణ’పై జగన్ దళంలో అసహనం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి .. తన అంతరంగంలోని బలీయమైన ఆకాంక్షను అణచి ఉంచుకోవడం చేతకాక.. కొన్ని సందర్భాల్లో నోరుజారి పలికే కొన్ని మాటలు పార్టీకి చేటు తెస్తున్నాయా? జగన్ మాట్లాడే కొన్ని మాటల వలన రాజకీయ వైరి పక్షాలు కూడా.. సాధారణమైన రాజకీయ శత్రుత్వాన్ని మించి, ద్వేషాన్ని, కక్షను పెంచుకునే పరిస్థితి ఏర్పడుతున్నదా? ప్రజల్లో కూడా అలాంటి మాటలు ఆయన పట్ల వ్యతిరేక భావనకు దారితీస్తున్నాయా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడం అంత సులువు కాదు. కానీ ఒక కోణంలోంచి చూసినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన అనేక మంది నాయకుల్లో మాత్రం ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైకి అనలేకపోయినా.. ఇలాంటి అంతర్మధనంలో వైకాపా శ్రేణులు నలిగిపోతున్నారు.
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి తాను మాత్రమే అర్హుడిననే భావన జగన్ కు చాలానే ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత.. విపక్షనేత స్థానానికి పరిమితం కావాల్సి వచ్చిన రోజునుంచి అనేక మార్లు ‘త్వరలోనే మన ప్రభుత్వం వచ్చేస్తుంది’ అని ప్రజలకు చెబుతూ వచ్చారు. పాలకపక్షం పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. కానీ గవర్నర్ ను కలిసి వచ్చిన ఓ సందర్భంలో.. నేను తలచుకుంటే ఏ క్షణమైనా చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది.. అంటూ జగన్ మీడియాతో వ్యాఖ్యానించడంతో .. చంద్రబాబు తనదైన శైలిలో పావులు కదిపారు. ఆ ఎఫెక్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పావు వంతు ఖాళీ అయింది. మా గుర్తుపై గెలిచి.. అటు వెళ్లిపోయారంటూ విలపించే పరిస్థితి వచ్చింది. అయితే ‘కేవలం జగన్ నోటిదూకుడు.. ఏ క్షణాన్నయినా ప్రభుత్వాన్ని కూల్చేస్తాననే వ్యాఖ్యల వల్లనే అన్ని ఫిరాయింపులు జరిగాయనేది చాలా మంది అభిప్రాయంగా ఉంది.
ఇప్పుడు జగన్ నాలుగు రోజుల కిందట వచ్చే ఏడాదిలో ఎన్నికలు వస్తాయంటూ ప్రకటించి.. మరో చర్చకు తెరతీశారు. దీని మీద చంద్రబాబు ప్రభుత్వం కూలుతుందనే ఉద్దేశం తమ పార్టీ అధినేతకు లేదని, ఆయన మనసులో ఉన్న సంగతి వేరే అని.. వైకాపా శ్రేణులు రకరకాల సర్ది చెప్పుకోడానికి పాట్లు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని శాసనసభలకు, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన ఒకటి కేంద్రం వద్ద ఉన్నందున, అది వచ్చే ఏడాది కార్యరూపంలోకి రావచ్చునని అధినేత అనుకుంటున్నట్లు వారు చెబుతున్నారు.
మొత్తానికి జగన్ మాటల దూకుడు పార్టీకి చేటు చేయకుండా జాగ్రత్త పడడం శ్రేణుల వంతు అయింది. అందుకే ఆయన పబ్లిక్ లో మాట్లాడేప్పుడు.. తడవకోమారు.. తొందర్లో నేను సీఎం అవుతా అంటూ ప్రకటించడం మానేసి, 2019 వరకు తాను ఈ ప్రతిపక్ష నేతగానే ఉండాల్సి ఉంటుందనే వాస్తవాన్ని జీర్ణం చేసుకోవాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

