దుర్గగుడిలో తాంత్రిక పూజల ఎఫెక్ట్... ఆమె బదిలీ...!

బెజవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేశారన్న ఆరోపణలపై ఆలయ ఈవో సూర్యకుమారిని బదిలీ చేసేందుకు రెడీ అయింది సర్కారు. తాంత్రిక పూజలు మంత్రి లోకేష్ కోసమే చేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దుర్గగుడి ఈవో మాత్రం దీనిని ఖండిస్తున్నారు. తాము ఎటువంటి తాంత్రిక పూజలు చేయలేదని, కేవలం ఆలయ శుద్ధి కార్యక్రమాన్నినిర్వహించామనే ఈవో సూర్యకుమారి అంటున్నారు.
తప్పుపడుతున్న హిందూ సంస్థలు...
అయితే దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడాన్ని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర అయితే ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. నియమ, నిబంధనలకు విరుద్ధంగా తాంత్రికపూజలు నిర్వహించేందుకు అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్వామిజీ కోరారు. అర్భకులైన అర్చకులపై చర్యలు తీసుకుని సరిపెడెతే ఊరుకోబోమని హెచ్చరించారు. దీనిపై త్వరలోనే అందరూ పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటుచేస్తానని ఆయన ప్రకటించారు.
పాలకవర్గం వత్తిడి కూడా....
ఇక ఆలయ ఈవో సూర్యకుమారికి, పాలకవర్గానికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఈవో పాలకవర్గాన్ని లెక్క చేయకపోవడమే ఇందుకు కారణం. పాలకవర్గ సభ్యులు ఎప్పటి నుంచో ఈవో సూర్యకుమారిని బదిలీ చేయాలని ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. అయితే తాజా తాంత్రికపూజల నేపథ్యంలో ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు దాదాపుగా పడినట్లే. ఆమె స్థానంలో సింహాచలం దేవస్థానంలో ఈవోగా పనిచేస్తున్న రామంచంద్ర మోహన్ ను ఈవోగా నియమించే అవకాశాలున్నాయి.
- Tags
- దుర్గగుడి

