దీపిక ముక్కు కోసి తీసుకొస్తే....!

పద్మావత్ సినిమా వివాదం మరింత రాజుకుంటుంది. దీపిక ముక్కు కోసి తెచ్చిన వారికి ఐదు లక్షల రివార్డు ఇస్తామని కర్ణిసేన ప్రకటించడం సంచలనమయింది. దేశవ్యాప్తంగా పద్మావత్ సినిమా ఈరోజు విడుదలయింది. అయితే ఈ సినిమా విడుదలను నిలుపదల చేయాలంటూ కర్ణిసేన, శ్రీరామ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విధ్వంసం సృష్టించారు. సినిమా థియేటర్ల వద్ద ఆందోళనకు దిగారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. దీంతో అనేక రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. కర్ణిసేన కార్యకర్తలు రాజస్థాన్ లో నిరసన ర్యాలీని నిర్వహించారు.
దేశవ్యాప్తంగా నిరసనలు...
పద్మావత్ సినిమాపై కర్ణిసేనల దాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. స్కూల్ బస్సు పై దాడిచేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. గురుగ్రామ్ లో స్కూల్ బస్సుపై కొందరు దాడి చేశారు. దీంతో పిల్లలు భయాందోళనలకు లోనయ్యారు. దేశంలో పకోడా పాలిటిక్స్ నడుపుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. స్కూల్ బస్ పై దాడి చేయడాని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సయితం విరుచుకుపడ్డారు. ముస్లింలను చంపి, దళితులను సజీవదహనం చేసిన వాళ్లు ఇప్పుడు ఇళ్లల్లోకి దూరి పిల్లల వెంట పడుతున్నారని, దీనికి మౌనం వహించడం అపరాధమే అవుతుందని చెప్పారు. పద్మావత్ చిత్రం గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో విడుదల కాలేదు. అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ఉండబట్టే విడుదల కాలేదని పలువురు విమర్శిస్తున్నారు.
సీఎం యోగి వార్నింగ్....
ఇక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ నిరసనకారులకు హెచ్చరికలు జారీ చేశారు. నిరసనను శాంతియుతంగాచేసుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యోగి ఆదిత్యానాధ్ హెచ్చరించారు. పద్మావత్ సినిమా విడుదల సందర్భంగా యోగి పోలీసు ఉన్నతాధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. విధ్వంసానికి పాల్పడిన వారిని ఎవరినీ వదలొ్ద్దని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు గస్తీ పెంచాలని, హింసాత్మక సంఘటనలు జరిగితే తక్షణమే స్పందిచాలని యోగి ఆదేశించారు.
డిగ్గీరాజా... సంచలనమే....
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా స్పందించారు. పద్మావత్ సినిమాకు తాను కూడా వ్యతిరేకమన్నారు. ఇటువంటి సినిమాలు తీయకపోవడమే మంచిదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. పద్మావత్ సినిమా విడుదలను అడ్డుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెబుతోంది. దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ కు చెందిన నేత కావడంతో ఆయన అక్కడి పరిస్థితులను బట్టి మాట్లాడారని కాంగ్రెస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. దిగ్విజయ్ గత కొంతకాలంగా మధ్యప్రదేశ్ లో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఆయన వివాదాలకు దూరంగా ఉంటున్నారు. తిరిగి పద్మావత్ చిత్రంపై తన అభిప్రాయాన్ని చెప్పి మరోసారి పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టారు.
- Tags
- పద్మావత్

