దినకరన్ హీరో అయింది ఇందుకేనా?

బీజేపీపై వ్యతిరేకతే దినకరన్ కు కలిసివచ్చిందా? అవునంటున్నారు విశ్లేషకులు. దినకరన్ తొలి నుంచి కమలనాధులను వ్యతిరేకిస్తున్నారు. తన మేనత్త జైలుకు వెళ్లడానికి బీజేపీ పెద్దలే కారణమని భావించిన దినకరన్ తొలినుంచి దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతోపాటు బీజేపీ పెద్దలు తమిళనాడు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కూడా ఆర్కే నగర్ ప్రజలకు మింగుడు పడలేదంటున్నారు. ఎందుకంటే పళనిస్వామి, పన్నీర్ సెల్వాన్ని ఒకటి చేసేందుకు బీజేపీ డ్రామా ఆడిందని గట్టిగా నమ్ముతున్నారు.
బీజేపీ వేలు పెట్టినందుకే....
జయ మరణానంతరం బీజేపీ తమిళరాజకీయాల్లో వేలు పెట్టడాన్ని సహించలేకపోయారు. అందుకే గంపగుత్తగా దినకరన్ కే ఆర్కే నగర్ ప్రజలు ఓటు వేశారని చెబుతున్నారు. జయ బతికున్నంతకాలం కేంద్రాన్ని శాసించే పరిస్థితులుండేవి. కాని ఇప్పుడు అన్నాడీఎంకే నేతలు కేంద్రం కాళ్ల వద్ద మోకారిల్లడాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు పళనిస్వామి, అటు పన్నీర్ సెల్వం ఇద్దరూ బీజేపీ ఏజెంట్లుగానే ఆర్కే నగర్ ప్రజలు భావించారు.
బీజేపీ సీన్ చూపారు...
ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో ఆర్కే నగర్ ప్రజలు కమలానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు విశ్లేషణలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడం విశేషం. ఇప్పటి వరకూ బీజేపీకి ఆర్కే నగర్ లో కేవలం 334 ఓట్లు మాత్రమే వచ్చాయి. తమిళ ప్రజుల తమ ఆత్మాభిమానాన్ని చూపారంటున్నారు దినకరన్ వర్గం నేతలు.
- Tags
- దినకరన్

