దినకరన్ ససేమిరా... అంటున్నారే!

ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం త్వరలోనే ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగుతుందనిప్రకటించింది. ఈ నేపథ్యంలో జయలలిత నెచ్చలి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పోటీ చేస్తారా? లేదా? అన్న ఉత్కంఠ నిన్న మొన్నటి దాకా కొనసాగింది. అయితే ఈరోజు టీటీవీ దినకరన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పోటీ చేయడమే కాదు గెలుపు కూడా తనదేనని తెలిపారు. టీటీవీ దినకరన్ ను అన్నాడీఎంకే బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షరతుల్లో భాగంగా కొద్ది రోజుల క్రితం టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ప్రకటించింది. దీంతో ఆగ్రహించిన దినకరన్ 21 మంది ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే నుంచి తీసుకెళ్లి తన వర్గంలోకి చేర్చుకున్నారు. కొన్ని రోజులు క్యాంపు కూడా నడిపారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్. దీనిపై మద్రాస్ హైకోర్టులో వివాదం నడుస్తోంది.
అన్నాడీఎంకే అభ్యర్థి ఎవరు?
టీటీవీ దినకరన్ ప్రకటనతో ఇప్పుడు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఎలాగైనా ఆర్కే నగర్ ఉప ఎన్నికను గెలుచుకుని అన్నాడీఎంకే తమదేనని ప్రజాతీర్పు ద్వరా తెలియజెప్పాలని ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో ఆర్కే ఉప ఎన్నిక నోటిఫికేషన్ పన్నీర్ సెల్వం తరుపున పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్ పోటీ చేశారు. గతంలో మధుసూదన్ ఆర్కే నగర్ నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. పన్నీర్ సెల్వం మాత్రం మధుసూదన్ ను బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పళనిస్వామి వర్గం మాత్రం ఆ నియోజకవర్గంలో మత్స్యకారులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో జాలర్ల కుటుంబానికి చెందిన అభ్యర్థినే నియమించాలని భావిస్తుంది. అయితే పళని, పన్నీర్ సెల్వంలు ఇద్దరూ కూర్చుని అభ్యర్థిని నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను పోటీచేస్తున్నట్లు దినకరన్ ప్రకటించడంతో అధికార అన్నాడీఎంకే పార్టీలో కలకలం మొదలయింది.
- Tags
- దినకరన్

