దినకరన్ ను ఒంటరి చేసేందుకు....!

అన్నాడీఎంకేను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని వీరిద్దరూనిర్ణయించారు. ఎవరు దినకరన్ వర్గమో...ఎవరు తమ వర్గమో తెలియని పరిస్థితి ఇటు ముఖ్యమంత్రి పళనిస్వామికి, అటు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి కలుగుతోంది. స్థానికసంస్థల ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరూ పార్టీ ప్రక్షాళనకు నడుంబిగించారు. ఇప్పటికే దినకరన్ వర్గీయులుగా భావిస్తున్న వెయ్యి మందిని పార్టీ నుంచి తొలగించారు. మరికొందరిపై వేటు వేయడానికి సిద్ధమవుతున్నారు. తొలగించిన వారి స్థానంలో కొత్త వారిని కూడా నియమిస్తున్నారు. కొత్తగా ఆరు జిల్లాలకు బాధ్యులను తమ వారిని నియమించుకున్నారు.
ఆ వాసనే లేకుండా చేయాలని....
దినకరన్, శశికళ వాసనలు పార్టీలో లేకుండా చేసేందుకు, పార్టీని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకునేందుకు పళని, పన్నీర్ సెల్వంలు కొత్త సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో దినకరన్ వర్గీయులుగా అనుమానం వచ్చిన వారి సభ్యత్వాలను పునరుద్ధరించరు. కొత్తగా తీసుకునే సభ్యుల విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. అధికారంలో ఉన్నందున ఇంటిలిజెన్స్ శాఖ సహకారంతో వారి ఆనుపానులను తెలుసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో కోటిన్నర మంది సభ్యులున్నారు. వీరందరూ ఈ కార్యక్రమంతో తమ సభ్యత్వాలను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
సభ్యత్వ నమోదు షురూ....
కొత్త సభ్యత్వ నమోదు, సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమాన్ని వీరిద్దరూ ఆర్భాటంగా పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. అన్నాడీఎంకే గుర్తు, పార్టీ పేరు తమ వర్గానికే రావడంతో వారు వచ్చే ఎన్నికల్లో అమ్మ ఫొటోతోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించకున్నారు. మరోవైపు టీటీవీ దినకరన్ వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన వారు దినకరన్ వెంట వెళ్లకుండా వీరు ముందుగానే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని షురూ చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో సయితం అన్నాడీఎంకే నేతలు కొందరు దినకరన్ కు సహకరించారన్న వార్తలతో వీరిద్దరూ అప్రమత్తమయ్యారు. అయితే కొత్త సభ్యత్వం కోసం పార్టీ కార్యాలయంలో ఉంచిన దరఖాస్తులన్నీ హాట్ కుకుల్లా అయిపోయాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు పన్నీర్, పళనిస్వామి. మొత్తం మీద దినకరన్ కు చెక్ చెప్పడానికి ముందస్తు ఏర్పాట్టన్నీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
- Tags
- దినకరన్

