దినకరన్ కు అది దక్కుతుందా?

ఆర్కే నగర్ అన్నాడీఎంకేకు కంచుకోట లాంటిది. రెండాకులకు వరుస విజయాలను అందిస్తున్న ఆర్కే నగర్ ప్రజలు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక వచ్చే నెల 21 వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ గత పదహారేళ్లుగా వరుసగా అన్నాడీఎంకే అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. చెన్నైని ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత పోటీచేశారు. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ అస్తవ్యస్తంగా మారింది. దినకరన్, పళనిస్వామి వర్గాలు ఇద్దరూ వేర్వేరుగా తమ అభ్యర్థులను బరిలోకి దించబోతున్నారు. దినకరన్ స్వయంగా పోటీ చేయబోతుండగా, పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు అన్నాడీఎంకే అధికారిక అభ్యర్థిని రేపోమాపో ప్రకటించబోతున్నారు. రెండాకుల గుర్తు వీరికి దక్కడంతో సెంటిమెంట్ పై నమ్మకం పెట్టుకున్న పళనిస్వామి ముందుగా ఆర్కే నగర్ లో ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందని సర్వే చేయించారు. సర్వే నివేదికల ప్రకారమే అభ్యర్థిని ప్రకటిస్తామని పళనిస్వామి వర్గం చెబుతోంది.
లాటరీ ద్వారా ఎంపిక.....
మరోవైపు దినకరన్ కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నెల 29వ తేదీన తిరుచ్చిలో జరిగే పార్టీ కార్యక్రమంలో ఈయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఈసారి కూడా టోపీ గుర్తు ను తీసుకోవాలని దినకరన్ గట్టిగా భావిస్తున్నారు. గతంలో ఏప్రిల్ నెలలో ఆర్కే నగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఇచ్చారు. దీని ప్రకారం దినకరన్ కు టోపీ గుర్తు రావడంతో ఆయన ఆ గుర్తును ఆర్కే నగర్ ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్లారు. టోపీలు ఇంటింటికీ అప్పట్లో పంచి పెట్టారు. సోషల్ మీడియా ద్వారా టోపీ గుర్తును బాగా ప్రచారం చేశారు. అయితే ఈసారి కూడా తనకు టోపీ గుర్తు ఇవ్వాలని ఆయన ఎన్నికల అధికారులను కోరనున్నట్లు తెలిసింది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయనున్నారు. దీంతో ఆయన టోపీ గుర్తు కోరుకున్నప్పటీకీ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎక్కువ మంది అభ్యర్థులు ఆ గుర్తును కోరుకుంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. లాటరీలో దినకరన్ కు టోపీ గుర్తు వస్తుందన్నది ఖచ్చితంగా తెలియదు. అంటే అదృష్టం ఉంటే తప్ప టోపీ గుర్తు దినకరన్ కు దక్కే ఛాన్స్ లేదు. దీంతో దినకరన్ తనకు సంబంధించిన మరికొందరి చేత నామినేషన్లు వేయించాలన్న యోచనలో ఉన్నారు. మొత్తం మీద దినకరన్ ఎలాగైనా ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు.
- Tags
- దినకరన్

