దిగేదెప్పుడు...? దూకేదెన్నడు?

పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం తొలిరోజు ముగిసింది. ఈ సమావేశంలో వివిధ వర్గాల నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మేధావులను, ఆర్థిక నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించారు. అయితే జేఎఫ్ సి కి అనుబంధంగా త్వరలోనే అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ అనుబంధ కమిటీల్లోనూ వివిధ వర్గాల నుంచి నేతలు, మేధావులు, నిపుణులు ఉంటారు. సబ్ కమిటీలు ఇచ్చిన నివేదికల మేరకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామని కమిటీ నేతలు చెబుతున్నారు. అయితే సమయం మించిపోతుందని, ఎన్నికల సమయంలో ఎలాంటి ఆందోళనలు చేసినా పట్టించుకోరన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఉద్యమబాట పట్టే అవకాశం లేనట్లే కన్పిస్తుంది.
రాజకీయాలతో సంబంధం లేకుండా....
ఇందులో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ కమిటీ ఏదో చేసేస్తుందని ఆశలు పెట్టుకోవద్దని తెలిపారు. నిజాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా మున్ముందు అందరం పనిచేస్తామన్నారు. ఇందులో రాజకీయ పార్టీ నేతలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలకోసమే తమ పంథా సాగుతుందనిజేపీ చెప్పారు. మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం తాము అన్ని పార్టీలనూ ఆహ్వానించామన్నారు. వైసీపీ, టీడీపీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించామని, అయితే వారు రాకపోవడానికి కారణాలు తనకు తెలియదన్నారు. టీడీపీ, వైసీపీలు వారిపంథాలో వారు పోరాటం చేస్తున్నారని, ఏపీ ప్రయోజనాల కోసం తన వంతు ప్రయత్నం తాను చేయనున్నట్లు పవన్ వివరించారు.
వైసీపీపై ఉండవల్లి సెటైర్లు.....
ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీకి చురకలంటించారు. 9నెలల ముందు రాజీనామాలు చేస్తే ప్రయోజనం ఏంటని ఉండవల్లి ప్రశ్నించారు. విభజన హామీల అమలు కోసం చివరి దాకా పార్లమెంటులో పోరాడాల్సిందేనని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి అసలు లేదని ఆయన చెప్పారు. అయితే వైసీపీ, టీడీపీ ఎంపీలంతా కలసికట్టుగా ఉద్యమిస్తే ఫలితముంటుందన్నారు. 25 మంది ఎంపీలు ఒక్కతాటిపైకి వస్తే కేంద్రం దిగిరావడానికి అవకాశముందన్నారు. ఏపీలో మోడీకి ప్రతిపక్షమే లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం మోడీని సమర్ధిస్తూనే ఉన్నాయన్నారు. జనసేన ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం శనివారం కూడా జరగనుంది. ఇటువంటి సమావేశాలు అనేక సార్లు జరుగుతాయని పవన్ కల్యాణ్ చెప్పారు.
- Tags
- పవన్ కల్యాణ్

