దాని కంటె మెరుగ్గా : టీ వ్యాలెట్ పై పెరిగిన కసరత్తు!

సంక్షేమ పథకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఒకదానితో ఒకటి పోటీపడి ప్రజలకు మేలు చేస్తున్నాయని చెప్పాల్సిందే. అలాంటిది ఇప్పుడు డిజిటల్ ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఇలాంటి పోటీ ఏర్పడుతోంది. రెండు ప్రభుత్వాలూ ప్రజలకోసం ప్రభుత్వం తరఫున యాప్ రూపొందిస్తున్నట్లు చెప్పాయి. టీ సర్కార్ కసరత్తులో ఉండగానే.. ఏపీ పర్స్ ను చంద్రబాబు ఆవిష్కరించేశారు. అయితే.. వారు ముందుగా ఆవిష్కరించడాన్ని కూడా ఒక ఎడ్వాంటేజీగా మార్చుకుని.. మరిన్ని సులువైన , వాడేవారికి అనువైన నమ్మకమైన ఫీచర్లను తాము పొందుపరచాలంటూ.. టీ వ్యాలెట్ రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
టీ వ్యాలెట్ బాధ్యతను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఆయన స్వయంగా యాప్ రూపకల్పన టీంతో కూర్చుంటూ పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించినట్లుగా ఈనెల 14 కలెక్టర్ల కాన్ఫరెన్సులో దీనిని ఆవిష్కరించాల్సి ఉంది. అయితే.. ‘ఏపీ పర్స్’ యాప్ వచ్చిన నేపథ్యంలో దానిని కూలంకషంగా పరిశీలించి.. అన్ని రకాలుగానూ దానికంటె మెరుగైన ఫీచర్స్ ఉండేటా టీ వ్యాలెట్ యాప్ ఉండాలని టార్గెట్ పెడుతున్నారట కేటీఆర్.
సాధారణంగా టెక్నాలజీ విషయంలో ... తొలి అడుగువేసే వారికంటె మలి అడుగు వేసే వారికే ఎడ్వాంటేజీ ఉంటుంది. తొలుత వచ్చిన యాప్ లో ఉండే ఇబ్బందుల్ని అన్నిటినీ స్టడీ చేసి.. వాటిని ఫిక్స్ చేసేలా తెలంగాణ యాప్ ఉండాలని ఐటీ టీం కసరత్తు చేస్తోందిట.
సినిమా హీరో చెప్పినట్టు లేటుగా వచ్చినా సరే.. లేటెస్టుగా రావడం మాత్రమే కాదు.. మరింత యూజర్ ఫ్రెండ్లీగా సామాన్యులకు కూడా ఎక్కువ ఉపయోగపడేలా.. కొత్త ఫీచర్లతో రావాలని తెలంగాణ వ్యాలెట్ యాప్ రూపకర్తలు పనిచేస్తున్నారట. ఆ తర్వాత.. మళ్లీ ‘ఏపీ పర్స్’ యాప్ కొత్త అప్డేట్స్ తో రివైజ్ చేస్తారేమో చూడాలి.

