దసరా తర్వాత.. టీతెదేపాలో జోష్ !

తెలంగాణ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అనేది అందరికీ తెలిసిన సంగతే. పార్టీలో మిగిలి ఉన్న నాయకులే చాలా తక్కువ మంది అయితే
వారి మధ్య కూడా ఆధిపత్య పోరాటం, సయోధ్య లేమి ఇత్యాది సకల అవలక్షణాలు పార్టీని పీడిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పార్టీ తిరిగి ఎప్పటికి జవజీవాలు
పుంజుకుంటుంది అన్నది అందరికీ ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే చంద్రబాబు మాత్రం తెలంగాణ పార్టీ మీద కూడా ఫోకస్ చూపిస్తున్నారు.
తాజాగా సోమవారం నాడు హైదరాబాదుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను తెలంగాణ తెలుగుదేశం నాయకులు వెళ్లి కలిశారు. తెలంగాణ
పార్టీ అధ్యక్షుడు రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర రెడ్డి తదితర నాయకులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణలో
పార్టీని పరిపుష్టం చేయడం గురించి వారికి చంద్రబాబు యాక్షన్ ప్లాన్ చెప్పినట్లుగా సమాచారం.
ఆమేరకు దసరా తర్వాత.. తెలంగాణలో కొత్త ప్రణాళికతో తెలుగుదేశం ముందుకు వెళ్లనుంది. ఇప్పుడు ఏర్పడబోతున్న 30 జిల్లాలకు కొత్త కమిటీలను
వేయడంతో పార్టీ నిర్మాణాన్ని పున:ప్రారంభిస్తారు. అలాగే త్వరలోనే తెలంగాణలో పదివేల మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేద్దాం
అని.. అందుకు అర్హులను ఎంపిక చేయాలని కూడా చంద్రబాబు వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దసరా తర్వాత
కొత్త ఇమేజి, కొత్త జవజీవాలు తీసుకురావడానికి చంద్రబాబు కూడా శ్రద్ధ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.

