త్వరలో 50లు, 20లు : కంటితుడుపు మాత్రమే!

దేశంలో త్వరలో 50, 20 రూపాయల డినామినేషన్ తో కొత్త నోట్లు తేబోతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. నోటు దెబ్బకు ప్రజలు దేశవ్యాప్తంగా విపరీతంగా చిల్లర కష్టాలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. నోట్ల రద్దు వెంటనే మూడో రోజుకెల్లా 2000 రూపాయల నోట్లను బ్యాంకులకు పంపి.. కొన్నాళ్లకు 500 రూపాయల కొత్త నోట్లను పంపి.. నగదు మార్పిడికి కేంద్రం అవకాశం ఇచ్చింది . అయితే అందరి వద్ద 2000 నోట్లే ఉంటున్నాయి గానీ.. ఆ నోటును ఖర్చు పెట్టే మార్గాలే దొరకడం లేదు. ఆ నోట్లను మార్చడానికి ఎక్కడా చిల్లర పుట్టడం లేదు. జేబులో 2000 నోటు పెట్టుకుని, కనీసం టిఫిను తిని, కాఫీ తాగడానికి కూడా దిక్కులేకుండా జనం నానా పాట్లు పడుతున్నారు. చిరు వ్యాపారాలు అన్నీ పడుకున్నాయి.
ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్లో వ్యతిరేకత తారస్థాయికి చేరుతున్న తరుణంలో.. ప్రభుత్వం నవనీత లేపనంలాగా ఓ చల్లటి కబురు చెప్పింది. త్వరలో 50, 20 నోట్లను కూడా తేబోతున్నామని, వాటితో పాటు పాత నోట్లు కూడా చెల్లుతాయని, అదనంగా ఈ 50, 20 నోట్లు వస్తాయని చెప్పింది. ఇది నిజంగా శుభవార్తే అని , చిల్లర కష్టాలు తీరుతాయని ప్రజలు మురిసిపోతున్నారు. కానీ, త్వరలో ఈ నోట్లు తెస్తాం అని ప్రకటించిన ఆర్బీఐ దానికి ఒక డెడ్ లైన్ ను చెప్పలేదు.
అయితే ఇక్కడ విశ్లేషకులు చెబుతున్న మర్మం ఏంటంటే.. ఈ కొత్త 50, 20 నోట్లు వస్తున్నాయనే ప్రకటన ఏదో జనం తిట్టిపోయకుండా.. కంటితుడుపు కోసం చెప్పిందే తప్ప అంత వెంటనే కార్యరూపం దాల్చేది కాదని అంటున్నారు. ఎందుకంటే.. రద్దయిన నోట్ల విలువకు సరిపడా 2000, 500 నోట్లను ప్రింట్ చేసి మార్కెట్ లో చెలామణీలో ఉంచడానికే రిజర్వు బ్యాంకు కు ఉన్న ప్రింటింగ్ సామర్థ్యాన్ని బట్టి 9 నెలలు పడుతుందని ఒక అంచనా. అలాంటి నేపథ్యంలో 50, 20 నోట్లను రద్దయిన నోట్ల విలువకు సరిపడా (లేదా అందులో కొంత భాగం వరకైనా సరే) మార్కెట్ లోకి తేవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక అంచనాకు రావచ్చు. కాకపోతే.. జనంలో వ్యతిరేకత పెరుగుతూ, సర్కారు వైఫల్యాన్ని తిట్టుకుంటున్నారని గుర్తించిన మోడీ సర్కారు.. వారికి తక్షణ ఊరట కలిగించే ఉద్దేశంతో ఇలాంటి మాట వదలినట్లుగా కనిపిస్తోంది.

