తొలిరోజు సక్సెస్

కాంగ్రెస్ తొలిరోజు బస్సుయాత్రకు మంచి స్పందన లభించింది. చేవెళ్ల నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్రలో సీనియర్లంతా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. చేవెళ్ల, వికారాబాద్ లలో జరిగిన బహిరంగ సభల్లో జనం అధిక సంఖ్యలో హాజరు కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఆత్మవిశ్వాసం నెలకొంది. ఈ సందర్భంగా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురి చేస్తున్నారన్నారు.
కేసీఆర్ మోసం చేశారు......
తెలంగాణ వస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయని ఆశపెట్టిన కేసీఆర్ తమ కుటుంబంలో నలుగురికి కొలువులు ఇచ్చారని చెప్పారు. రైతులను కూడా మోసం చేశారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వరి, మొక్కజొన్న పంటలకు కనీసం మద్దతు ధరను రెండువేలు, పత్తికి ఆరువేలు, మిర్చికి పదివేలు తగ్గకుండా మద్దతు ధర ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేసీఆర్ మోసల గారడీకి మోస పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలకబూనిన కుంతియా.....
ఇక రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తో ఎటువంటి యుద్ధానికైనా తాము సిద్ధమని ప్రకటించారు. మాజీ ఎంపీ అజారుద్దీన్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తానని చెప్పారు. డిసెంబర్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశముందని పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపు నిచ్చారు. అయితే బస్సు యాత్ర తొలిరోజే తెలంగాణ పార్టీ ఇన్ ఛార్జి కుంతియా అసహనం వ్యక్తం చేశారు. చేవెళ్లలో జరిగన సభా వేదికపై కుంతియా వచ్చేసరికి చోటు లేకపోవడంతో ఆయన అలిగి కింద కూర్చున్నారు. నేతలను బతిమాలి ఆయనను తీసుకురావాల్సి వచ్చింది. మొత్తం మొదట రోజు బస్సు యాత్ర సక్సెస్ అనే చెప్పొచ్చు.

