తొడకొట్టిన జగన్ : హోదా కోసం ఎంపీల రాజీనామాలు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన సవాలు విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే అంశాన్ని తామేమీ ఆషామాషీగా తీసుకోవడం లేదని... అందుకోసం తమ పార్టీ త్యాగాలకు కూడా సిద్ధంగానే ఉన్నదని వైఎస్ జగన్మోహన రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలోగా కేంద్రం మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా గనుక ఇవ్వకపోతే.. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం అని జగన్మోహనరెడ్డి జనం హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రాజీనామాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి.. హోదా డిమాండుకు ప్రజల మద్దతు ఉన్నదనే విషయాన్ని తమ ఎన్నిక ద్వారా నిరూపించి.. మళ్లీ సభలో అదే డిమాండ్ ను వినిపిస్తాం అని జగన్మోహన రెడ్డి అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదని జగన్ అన్నారు. కర్పూలులో మంగళవారం నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాబోయే శీతాకాల సమావేశాలు, ఆతర్వాతి బడ్జెట్ సమావేశాల్లో కూడా తమ పార్టీ ఎంపీలు ప్రత్యేకహోదా డిమాండ్ తో పార్లమెంటును స్తంభింపజేసే ప్రయత్నం చేస్తారన్నారు. పోరాడుతారని చెప్పారు. అప్పటికీ కేంద్రం గనుక పట్టించుకోకపోతే.. బడ్జెట్ సమావేశాల తర్వాతి సమావేశాలు వచ్చేలోగా తమ ఎంపీలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్తాం అని జగన్ చెప్పారు.
ప్రత్యేకహోదా అనేది రాష్ట్రానికి సంజీవని వంటిదని, యువతరానికి ఆశాదీపం అని ఆ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని చెప్పిన జగన్.. ఎంపీల రాజీనామాలు అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా తమ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని చెప్పడమే కాకుండా, రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా భారీగా ఒత్తిడి పెంచినట్లు అవుతోంది. తెదేపా ఎంపీలు రాజీనామాలు చేస్తే హోదా వస్తుందని పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు ఒకవైపు డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో వైకాపా ఎంపీల రాజీనామాల గురించిన ప్రకటన రాజకీయంగా ప్రకంపనాలు సృష్టించడం అనేది ఖాయంగా కనిపిస్తోంది.

