తెలుగు రాష్ట్రాల ఐక్యగళం : కృష్ణాపై సుప్రీంలో పోరాటం

కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజాగా ఇచ్చిన తీర్పు మీద ఆగ్రహంతో ఉన్న తెలుగు రాష్ట్రాలు రెండూ.. సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించాయి. కృష్ణా జలాలను ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే పంచడానికి ట్రిబ్యునల్ పనిచేస్తుందంటూ బ్రిజేష్ కుమార్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనివల్ల.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని అందరూ వాదిస్తున్నారు. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు కూడా శుక్రవారం నాడు కలిసి పోరాటం సాగించాలనే నిర్ణయానికి రావడం విశేషం.
శుక్రవారం జరిగిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ పాలిట్ బ్యూరోలో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. సమావేశం పార్టీ నాయకులతో చర్చించిన చంద్రబాబునాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుతో కలిసి ఈ విషయంలో న్యాయం కోసం పోరాడుతాం అని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పనిచేయాలని, తాను తొలినుంచి అదే చెబుతున్నానని, అలాగైతే అందరికీ మేలు జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు తెలంగాణ సర్కారు కూడా కృష్ణా జలాల కేటాయింపులపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు గురించి చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశం అయింది. కేసీఆర్ ఏకంగా నీటిపారుదల రంగ సలహాదారును, న్యాయనిపుణులను, అడ్వొకేట్ జనరల్ ను కూడా సమావేశానికి పిలిపించి.. సుప్రీంలో పిటిషన్ వేయడం ద్వారా ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఎలా పోరాడవచ్చునో చర్చించారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి ఐక్యంగా సుప్రీంలో పోరాటం సాగించాలని తేల్చారు.
అంశం ఏదైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి సుప్రీంలో పోరాడడం ద్వారా న్యాయంగా తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నీటి వాటాలను సాధించుకోవడానికి పూనుకోవడం అనేది సంతోషకరం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

