తెలుగు తమ్ముళ్లు పిండేస్తున్నారే

దేశంలోని నదుల్లో శృతి మించి సాగుతున్న ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇలా ఇసుక తవ్వుకుంటూ పోతే భవిష్యత్తులో నదులు ఎడారులుగా మారే అవకాశాలు ఉన్నాయన్నది సుప్రీం వేదన. ఇది ఒక్క సుప్రీం కోర్టు బాధే కాదు. పర్యావరణ వేత్తలు, సామాజిక వేత్తలు, పౌర సంఘాల ఆందోళన కూడా. కానీ దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుకని తమ నేతల అభివృధ్ధికోసం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేయడం, అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించకుండా అక్రమ రవాణాకు సైతం బ్యాక్ డోర్ నుంచి అనుమతులు ఇచ్చేయడం యథేచ్ఛగా సాగిపోతున్నాయి.
తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ...
ఏపీ విషయం పరిశీలిస్తే అధికార తెలుగుదేశం క్యాడర్ కి అనధికార ఆదాయ మార్గం ఇసుకే అన్నది బహిరంగ రహస్యం. పేరుకే రాష్ట్రంలో ఉచిత ఇసుక తప్ప గతంలో వున్న ధరలకు ప్రస్తుత ధరకు తేడా ఏమి లేదు. గోదావరి తీర ప్రాంతంలో ఇసుకే బంగారంగా చెలామణి అవుతున్న నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 12 రేవులకు అనుమతులు మంజూరు చేసిన జిల్లా అధికారులు మరో 12 రేవులకు కొత్తగా అనుమతి ఇవ్వడం పర్యావరణ వేత్తలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ వ్యవహారంపై విపక్షాలు ఘాటు విమర్శలకు, ఆరోపణలకు దిగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఖర్చుల కోసమే మరో 12 రేవులకు అనుమతి ఇచ్చేశారన్న ప్రచారం మొదలు పెట్టాయి.
గోదావరిలో ఇప్పటికే తక్కువైన నీటి లభ్యత ...
వేసవిలో గోదావరి తీరం ప్రతిఏటా నీటి కష్టాలు ఎదుర్కొంటుంది. అనుమతులకు మించి ఇసుక అక్రమ తవ్వకాలతో నదిలో నీటి లభ్యత తగ్గుతూ వస్తుంది. అదీగాక ధవళేశ్వరం బ్యారేజ్ దిగువ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు లంక ప్రాంతాల్లో వున్న పొలాలకు నీటి లభ్యత మరింత తగ్గేలా చేస్తుంది. ఒక పక్క పెద్ద ఎత్తున ఈ వ్యవహారంపై ఆరోపణలు, విమర్శలు వస్తున్నా సర్కార్ మాత్రం తమ పార్టీ నేతల నుంచి వస్తున్న వత్తిడులకు తలొగ్గే ఇసుక వంటి వాటి విషయంలో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ రావడం ఆందోళనకరం.
- Tags
- ఇసుక

