తెలుగు తమ్ముళ్ల చేతివాటం ఇంతింత కాదయా...!

తెలుగు తమ్ముళ్ల చేతివాటానికి తిరుగులేకుండా పోతోంది. కడప జిల్లాలో జరిగిన ఈ సంఘటన చూస్తుంటే నిజమేననిపిస్తోంది. అవినీతి చేసిన వారు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ లు మీద వార్నింగ్ లు బహిరంగసభల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తూనే ఉన్నారు. కాని ఆ వార్నింగ్ లు సొంత పార్టీ వారికి కాదని స్పష్టమయింది. కడప జిల్లాలో ఇళ్ల కుంభకోణం చూస్తుంటే అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందవనే అర్థమయిపోయింది. 1100 కాల్ సెంటర్, రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు సొంతపార్టీ నేతలనే కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
భారీగా అవకతవకలు....
కడప పట్టణంలో ఇళ్ల స్థలాలు, పక్కాఇళ్ల మంజూరులో భారీగా అవకతవకలు జరిగాయని అధికారులు గుర్తించారు. ఇళ్లులేని పేదలకు ఆవాసం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జన్మభూమి కార్యక్రమంలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీని చేపట్టింది. ఐదో విడత జన్మభూమిలో కడప జిల్లాలో మొత్తం 11,535 మందికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఒక్క కడప కార్పొరేషన్ పరిధిలో 825 మంది నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలనుకున్నారు. అయితే కొందరు కార్పొరేటర్లు ఈ విషయంలో చేతివాటం చూపారు.
మంచి డిమాండ్ ఉండటంతో....
కడప పట్టణంలో ఇళ్ల స్థలాల పంపిణీలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయి. స్థలాన్ని బట్టి పది వేల నుంచి 20 వేల వరకూ పేదల నుంచి వసూలు చేశారు. కడప నగరంలో ఉన్న ఉక్కాయపల్లె లే అవుట్, రాజీవ్ గృహకల్ప, చిన్న చౌక్ ప్రాంతాల్లో ఈ స్థలాలను కేటాయించారు. వీటిలో చిన్న చౌక్, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో ఉన్న స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో స్థలం మంజూరుకావాలంటే చేయి తడపాల్సిందేననడంతో పేదలు అప్పు చేసి మరీ కొందరు కార్పొరేటర్లకు తెచ్చి ఇచ్చారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి అధికారులకు చేరడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
కార్పొరేటర్ల హైడ్రామా....
కడపలో మొత్తం యాభై డివిజన్లుంటే అందులో కొన్నింటికే ఇంటి స్థలాలను మంజూరు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలయిన ఒక మహిళకు, ఆమె ఇద్దరు కూతుళ్లకు కూడా ఇళ్ల స్థలాలు దక్కాయి. మరో డివిజన్ లో కూడా ఓడిపోయిన అభ్యర్థితో పాటు వారి పిల్లలకు కూడా ఇంటి స్థలాలను కేటాయించారు. ఒకే ఇంట్లో ఆరుగురికి ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు విచారణలో తేలింది. ఒక కార్పొరేటర్ అయితే ఏకంగా ఐదు స్థలాలను తీసుకున్నారు. ఆయన తన భార్య పేరిట పట్టా పొందారు. ఉన్నతాధికారుల విచారణలో దాదాపు 210 స్థలాలు అనర్హులకు అందినట్లు అధికారులు లెక్క తేల్చారు. ఈ అవినీతి దందాపై ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయినట్లు సమాచారం. అయితే టీడీపీకి చెందిన పది మంది కార్పొరేటర్లు ఈ విచారణ నివేదిక బయటకు రాకుండా రాజీనామా డ్రామా ఆడారు. అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి జోక్యంతో రాజీనామాలు వెనక్కు తీసుకున్నారు. ఈ అవినీతిపరులపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారా? లేక మనోళ్లే కదా? అని వదిలేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
- Tags
- టీడీపీ

