తెలంగాణలో కొత్త ఫ్రంట్... కేసీఆర్కు లాభమా... నష్టమా..!

తెలంగాణలో ఆవిర్భవిస్తున్న సరికొత్త రాజకీయ ఫ్రంట్ తో ఎవరికి లాభం..? సాధారణంగా ఎన్నికల ముందు ఫ్రంట్లు వస్తూ పోతూ ఉంటాయి.. ఈసారి తెలంగాణలో కొంత భిన్నమైన దృక్పథంతో వస్తున్న ఫ్రంట్ లక్ష్యం ఏమిటి..? బహుజన లెఫ్ట్ ఫ్రంట్ గా చెబుతున్నా... అది ప్రభుత్వాన్ని కూల్చుతుందా..? లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి అధికార పార్టీకి లాభం చేస్తుందా..? అన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జేఏసీలో టీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగుల సంఘాలు ఉన్నాయి. ఇందులో మొదటి నుంచీ కూడా కొన్ని సంఘాలు భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు సామాజిక తెలంగాణ సాధించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని చెబుతున్నాయి.
సీపీఎం నేతృత్వంలో....
అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం ఇస్తేమాత్రం తమకేమీ అభ్యంతరం లేదని చెప్పిన సీపీఎం నేతృత్వంలో తెలంగాణ లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడుతుండడం గమనార్హం. ఇందులో ఇప్పటి వరకూ సుమారు 28 పార్టీలు భాగస్వామ్యం. అవుతున్నాయని, మిగతా పార్టీలు కూడా రావాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కోరారు. అయితే అందరిలో ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతంగా నిర్ణయం తీసుకుని అందరినీ ఆహ్వానించడం ఏమిటని ? అందరినీ సమన్వయపరిచి సమగ్రంగా చర్చించి ఫ్రంట్ పేరును, లక్ష్యాన్ని ఖరారు చేయవచ్చు కదా అని. ఇప్పటికే తెలంగాణలో ఏర్పడిన... ఇదే సీపీఎం నేతృత్వంలో ఆవిర్భవించిన మాస్ పరిస్థితి ఏమిటన్నది జవాబు లేని ప్రశ్న.
జేఏసీ ఉందిగా...
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా జేఏసీ ఉద్యమిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని పార్టీలు, సంఘాలు జేఏసీ నుంచి బయటకు వెళ్లి పోయాయి. అయినా తాము వెనకడుగు వేయబోమని.. తెలంగాణలో సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తామని జేఏసీ చైర్మన్ కోదండరాం చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సాధన సారథులు కేసీఆర్, కోదండరాం ప్రత్యర్థులుగా మారారు. ఒకరు ప్రభుత్వాధినేతగా, మరొకరు ప్రజా ఉద్యమంలో కొనసాతున్నారు. టీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలేదనీ, సామాజిక న్యాయాన్ని పట్టించుకోకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన కొలువుల కొట్లాట సభకు ప్రభుత్వం అడుగడుగునా నిర్భంధం విధించినా వేలాది నిరుద్యోగులు తరలివచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్న జేఏసీ కేంద్రంగా అన్ని సంఘాలు, పార్టీలు కలిసి పనిచేయాల్సిన సమయంలో కొత్త ఫ్రంట్ ఆవిర్భావం ఆంతర్యం అంతుబట్టడంలేదని పలువురు నేతలు అంటున్నారు.
కులంగా గళం....
కొత్తగా ఏర్పడుతున్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కులంగా గళం వినిపిస్తుందని పేరునుబట్టే ఎవరికైనా అర్థం అవుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా కులాలు, వృత్తుల ఆధారంగానే అనేక పథకాలు అమలు చేస్తోంది. హైదరాబాద్ లో కుల భవనాలు కూడా నిర్మిస్తోంది. నేడు కులవృత్తులన్నీ ఆధునికతను సంతరించుకుని కులవృత్తికి సంబంధంలేని పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లాయనీ, ఈ నేపథ్యంలో మారిన పరిస్థితులకు తగ్గట్టు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కులవృత్తులకు పూర్వవైభవం అంటూ ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.
వ్యతిరేక ఓటు చీలితే....
ఈ పరిణామాలన్నింటితో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికార పార్టీకే లాభం జరుగుతుందని చెబుతున్నారు. ఇదిలావుండగా సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పత్రిక, టీవీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ అందడంలేదని, దీంతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకే ప్రభుత్వంతో అంతర్గతంగా ఒప్పందానికి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో ప్రజల ముందుకొస్తుందనే ఆరోపణలు రావడం గమనార్హం.
- Tags
- కేసీఆర్

