తిరుమల వెళితే ఈ విషయంలో జాగ్రత్త...!

తిరుమలలో భక్తులు శ్రీవారికి నిలువు దోపిడీ మొక్కు చెల్లించుకుంటారు. కాని నిలువు దోపిడీని అక్కడి అధికారులే భక్తులను చేస్తన్నారు. తిరుమల పుణ్యక్షేత్రానికి రోజూ 70 వేలకు తగ్గకుండా భక్తులు వస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఏడుకొండల్లో పక్కా బిజెనెస్ సెంటర్ అయిపోయింది. తిరుమలకు వచ్చే భక్తులను ఆకలిని తీర్చేందుకు టీటీడీ ఉచితంగా భోజనపథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే భక్తుల్లో సగం మందే అన్నదానానికి వెళతారు.మిగిలిన వాళ్లు క్యూలైన్లలో నిల్చోలేక ప్రయివేటు హోటళ్లను ఆశ్రయిస్తారు. తిరుమల కొండపై ప్రయివేటు హోటళ్లకు ఇబ్బడి ముబ్బడిగా టీటీడీ అనుమతిచ్చింది. అయితే లైసెన్స్ లు ఇచ్చేటప్పుడే ఆధ్మాత్మిక క్షేత్రం కాబట్టి తక్కువ ధరలకే విక్రయించాలని నిబంధన విధించింది. అయితే కొండపై హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఈ నిబంధనను ఏమాత్రం అమలు చేయరు. ధరలు నాలుగు రెట్లు భక్తుల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. అయితే దీనిపై ఎంతమందికి ఫిర్యాదు చేసినా టీటీడీ అధికారులు పట్టించుకోరన్నది అక్షర సత్యం.
హైకోర్టు అక్షింతలు వేసినా....
అయితే చిత్తూరుకు చెందిన పరిహార సమితి అధ్యక్షుడు భరధ్వాజ్ భక్తులతో కలసి 11 నెలల క్రితం తిరుమల కొండకు వచ్చారు. అక్కడి ప్రయివేటు హోటళ్ల యాజమాన్యం దోపిడీ చూసి చలించిపోయారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలను సేకరించిన భరధ్వాజ్ అధిక ధరలకు ఆహార పదార్థాలను తిరుమలలో విక్రయిస్తున్నా టీటీడీ పట్టించుకోవడం లేదని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని టీటీడీని ఆదేశించింది. అయితే టీటీడీ హైకోర్టు ఆదేశాలను కూడా లైట్ గా తీసుకుంది. న్యాయస్థానానికి వివరణ ఇవ్వలేదు. దీంతో మంగళవారం టీటీడీ ఈవోను హైకోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీటీడీ కొండపై హడావిడి చేయడం ప్రారంభించింది. హైకోర్టుకు వివరణ ఇచ్చేందుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈరోజు హైకోర్టుకు చేరుకున్నారు. తిరుమలలోని హోటళ్ల పై ఏమేం చర్యలు తీసుకుందీ కోర్టుకు అఫడవిట్ రూపంలో సమర్పించారు. భక్తులకు ఏయే సౌకర్యాలు సమకూరుస్తున్నామో తెలిపారు. భక్తుడు ఆధారాలతో సేకరించి హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప టీటీడీలో చలనం రాలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
- Tags
- తిరుమల

