తాగుబోతులు కొత్తదారి కనిపెట్టారే ...?

మద్యం తాగి వాహనాలు రోడ్డు ఎక్కిస్తే అవి నడిపే వారికే కాదు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. దీనిపై కేసుల్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం రెండో సారి దొరికితే జైలు కి పంపడం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టినా ఫలితం ఉండటం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న ప్రమాదాలు ఎందరినో బలిగొన్నాయి. అయినా కానీ మందుబాబుల ఆగడాలకు అంతు పొంతూ లేకుండా పోతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చనిపోతున్న వారిలో అత్యధిక శాతం యువతే కావడం గమనార్హం .
పోలీసులు పట్టు బిగించడంతో ...
ఏపీ మంత్రి నారాయణ కుమారుడి మరణం తరువాత హైదరాబాద్ లో పోలీసులు రాత్రివేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లు దగ్గర గస్తీ పెంచారు. అర్ధరాత్రి 2 గంటల వరకు ఖాకీలు మందుబాబులను వెంటాడుతున్నారు. దాంతో మద్యం సేవించి డ్రైవ్ చేసేవారు కొన్ని షార్ట్ కట్స్ కనిపెట్టారు. అర్ధరాత్రి 2 గంటల తరువాత పోలీస్ గస్తీ బృందాలు విధులనుంచి తప్పుకుంటారన్న సమాచారం తో అప్పటివరకు తాగేస్తున్నారు కొందరు. అర్ధరాత్రి రెండుగంటలు దాటినా తరువాతే వాహనం ఎక్కుతున్నారు. ఒక వైపు నిషాతో మరో పక్క గస్తీ లేదన్న ధీమాతో మితిమీరిన వేగంతో ప్రమాదాల పాలై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చాలామంది. ఇటీవలే మృతి చెందిన మస్తానీ, అనన్య, బలికాగా తాజాగా బాసర అర్చకుడు విశ్వజిత్ తాగి డ్రైవ్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలా రోజు ఏదో ఒక చోట మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాలు పిట్టల్లా రాలిపోయేలా స్వయం కృతాపరాధాలతో చేసుకుంటున్నారు. దాంతో ఇప్పుడు భాగ్యనగర్ వాసులు తెల్లవారే వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ బృందాలు పనిచేసేలా పోలీసులు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
- Tags
- మద్యం సేవించి

