తలైవా.... ఇక జనంబాట

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో రాష్ట్ర పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన చేసే అవకాశముంది. రజనీ కాంత్ రాజకీయాల్లో కి సీరియస్ గా రావాలనుకుంటున్నారు. ఇప్పటికే సభ్యత్వాలను ముమ్మరం చేసిన తలైవా వీలయినంత త్వరగా పార్టీని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే మక్కల్ మండ్రం ను ఏర్పాటు చేసి సభ్యత్వాలను షురూ చేశారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో అభిమానులు, తటస్థులు రజనీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు.
రజనీకంటే ముందుగా.....
రజనీకాంత్ కంటే ముందుగానే విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇటీవలే పార్టీని ప్రకటించారు. ఆయన ఆర్భాటంగా పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ ఇప్పటికే మేధావులతో, ముఖ్యమైన నేతలతో చర్చలు జరుపుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన దక్షిణాదిన కూటమిని ఏర్పాటు చేయాలన్న తలంపుతో ఉన్నారు. ఈనేపథ్యంలో రజనీకాంత్ ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు.
జిల్లాల పర్యటన.....
ఇప్పటికే జిల్లాల వారిగా నిర్వాహకులను రజనీకాంత్ ఎంపిక చేశారు. అయితే రజనీని త్వరలోనే పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలను ప్రకటించే అవకాశముంది. దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తయినట్లు రజనీ సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే రజనీకాంత్ జిల్లాల వారీగా పర్యటించి ప్రజలను స్వయంగా కలుసుకుని సమస్యలను తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. మరి పర్యటనలోనే పార్టీని ప్రకటిస్తారా? లేక జిల్లాల పర్యటనలు పూర్తయిన తర్వాత రజనీ కమల్ లాగే బహిరంగ సభలో పార్టీని ప్రకటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
- Tags
- రజనీకాంత్

