తమిళనాడులో ఇప్పుడంతా కన్ ఫ్యూజన్...!

తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. అయినా అక్కడ రాజకీయం ఎప్పుడూ హీట్ గానే ఉంటుంది. కొత్త పార్టీలు రావడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో పార్టీలు సమయాత్తమవుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలను రచించుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకేను దెబ్బకొట్టేందుకు ఇటు డీఎంకే, ఇటు టీటీవీ దినకరన్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యాయి.
పార్టీలకు కొదవలేదు....
తమిళనాట ఇప్పుడు పార్టీలకు కొదవలేదు. రజనీకాంత్ కొత్త పార్టీ వస్తుంది. కమల్ హాసన్ వచ్చే నెల నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఎటూ ఉండనే ఉంది. డీఎంకే ప్రభుత్వ ఓట్లను కొత్త పార్టీలు చీల్చుకుంటే తాము లాభపడతామని భావిస్తోంది. ఇటీవల తమిళనాడులో బస్సు ఛార్జీలను ప్రభుత్వం విధించింది. ప్రస్తుతం తమిళనాడు అంతటా ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. డీఎంకే ఇందులో ముందుంది. బస్సు ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారంటూ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు కాంగ్రెస్, ముస్లింలీగ్ లతో పాటు ఇతర పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు తెలిపాయి. రేపు కూడా ఆందోళనలకు అన్ని పార్టీలూ పిలుపునిచ్చాయి.
ప్రభుత్వ వ్యతిరేకతను....
అయితే మరోవైపు టీటీవీ దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఊపుమీద కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తమ మద్దతుదారుల సూచనలతో వెనక్కు తగ్గారు. దినకరన్ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తాము ఆ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పారు. అందుకోసం ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ ను పెంచుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని దినకరన్ భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఛార్జీల పెంపుకూడా దినకరన్ తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అంతు చూస్తామంటున్నారు దినకరన్. వీరితో పాటు డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కూడా మళ్లీ సీన్ లోకి వచ్చారు. త్వరలోనే తాను కూడా ప్రజల మధ్యకు రానున్నట్లు ప్రకటించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని విజయ్ కాంత్ భావిస్తున్నారు. మొత్తం మీద తమిళనాడులో రాజకీయ పార్టీల హడావిడితో అప్పుడే ఎన్నికల వేడి ప్రారంభమయిందనేచెప్పాలి. అయితే ప్రజలకు మాత్రం రాజకీయ పార్టీల హడావిడితో గందరగోళానికి గురవుతున్నారు.
- Tags
- తమిళనాడు

