తప్పు దొరకడంతో తప్పుకున్నారు

క్రికెట్ ఆస్ట్రేలియా కి సంక్షోభ సమయం ఆసన్నమైంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ లో బాల్ ట్యాపరింగ్ కి పాల్పడి ఆసీస్ క్రికెటర్లు అడ్డంగా బుక్ కావడంతో ఇప్పుడు ఆస్ట్రేలియన్ టీం లో ప్రకంపనలు బయలుదేరాయి. విచారణ పూర్తి అయ్యేవరకు దక్షిణాఫ్రికా వీడి ఎక్కడికి వెళ్లరాదని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ వారికీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో స్మిత్, డేవిడ్ వార్నర్, బెన్ క్రాఫ్ట్ లు అక్కడే వుండాలిసిన పరిస్థితి తలెత్తింది. ట్యాపరింగ్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా ఆసీస్ అభిమానులను కలవరానికి గురిచేసింది. ఆ జట్టు ఆటగాళ్లపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఐపీఎల్ కి దూరమైన వార్నర్, స్మిత్ ...
బాల్ ట్యాపరింగ్ కేసులో పీకలలోతు కూరుకుపోయిన స్మిత్, వార్నర్ లు ఈ సీజన్ లో మొదలయ్యే ఐపీఎల్ లో పాల్గొనాల్సివుంది. వారిపై అభియోగాలకు సంబంధించి విచారణ మొదలు కానున్న నేపథ్యంలో వారిద్దరూ భారత్ లో మ్యాచ్ ల్లో పాల్గొనడం లేదని సమాచారం అందింది. రాజస్థాన్ రాయల్స్ కి సారధ్యం వహిస్తున్న వార్నర్ తప్పుకోవడంతో డేవిడ్ స్థానంలో కెప్టెన్ గా భారత స్టార్ క్రికెటర్ అజింక్య రహానే బాధ్యతలు చేపట్టనున్నారు.
యాసిస్ పై దుమారం రేపుతున్న వీడియో ...
ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ టీం కి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇటీవల ముగిసిన యాసిస్ సిరీస్ లోను గెలుపుకోసం ఆస్ట్రేలియా అడ్డదారులు తొక్కిందని ఆరోపణలు మొదలయ్యాయి. ఈ ఆరోపణలు బలపరుస్తూ ఒక వీడియో సంచలనం సృష్టిస్తుంది. ఆసీస్ క్రీడాకారులు బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ఇది. ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో అభాసుపాలైన ఆస్ట్రేలియా తాజా వీడియో నిజమని తేలితే మరింత పరువు పోగొట్టుకుని బజారు పాలౌతుందంటున్నారు క్రీడా విశ్లేషకులు. ప్రపంచ దిగ్గజ జట్టుగా స్ఫూర్తివంతమైన ఆట తీరుతో ప్రత్యర్థులను గడగడ లాడించిన ఒకప్పటి ఆసీస్ టీం కి నేటి ఆసీస్ టీం కి లెక్కలు వేస్తూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నెటిజెన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. మరో పక్క తాజా ఆరోపణలు విచారణలు పూర్తయ్యి నిజాలు నిగ్గుతేలితే తొండి ఆట ఆడుతున్న ఆస్ట్రేలియన్ క్రీడాకారులు ఎవరైతే వున్నారో వారికి జీవితకాల నిషేధం ఐసీసీ నుంచి ఎదురయ్యే ప్రమాదం పొంచి వుంది
