తప్పు కోడెలది కాదట... సుప్రీం కోర్టుదేనట...?

పార్టీ ఫిరాయింపుల అంశం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ తన పార్టీ పదవులతో పాటు ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి విలువలు పాటించడంతో టిడిపి, టిఆర్ ఎస్ అధికార పార్టీలలోకి పెద్ద ఎత్తున గోడ దూకిన ఎమ్యెల్యేలు గత్తుక్కుమన్నారు. ఇలా అధికార పార్టీలోకి రాజీనామా చేయకుండా వెళ్ళే వారిపై ప్రజల్లో చర్చ మొదలైంది. మరోవైపు వైసిపి సైతం తమ పార్టీలో గెలిచి అధికార పార్టీలోకి దూకిన ఎమ్యెల్యేలపై అనర్హత వేటు వేసేవరకు అసెంబ్లీకి రానే రాము అంటూ తేల్చేసి చర్చ ను సుదీర్ఘంగా కొనసాగిస్తోంది. ఇలా అటు ఇటు వత్తిడి పెరిగిపోయిన నేపథ్యంలో టిడిపి కొత్తపల్లవి అందుకుని తప్పంతా వైసిపి వారిదే అంటూ తమ సొంత మీడియా లో ప్రచారం ముమ్మరం చేసింది.
అసలు ఆలస్యం అందుకే ...
పార్టీ ఫిరాయింపు ఎమ్యెల్యే లు 21 మందిపై వైసిపి స్పీకర్ కి ఫిర్యాదు చేసింది. అందులో 11 మంది పై ఇచ్చిన ఫిర్యాదులు స్పీకర్ ఫార్మాట్ లో లేవని అనడంతో తిరిగి ఫిర్యాదు చేసింది. అయినా చర్యలు ఏమి లేకపోవడంతో హై కోర్టు కి ఆ తరువాత సుప్రీం కోర్ట్ లో కేసు వేసింది వైసిపి. ఇలాంటి కేసులే తెలంగాణ నుంచి టిడిపి కూడా టిఆర్ఎస్ పై వేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి జంపింగ్ జపాంగ్ ల సంగతి తేల్చేందుకు సుప్రీం కోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. చట్టంలో నిర్ణీత కాలవ్యవధి ఫిరాయింపు దారులపై లేకపోవడంతో అధికార పార్టీ లకు అనుకూలంగా స్పీకర్ లు వివిధ రాష్ట్రాల్లో నడుచుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై లోతుగా విచారణ జరగనుంది. సుప్రీం ధర్మాసనంలో జడ్జీల కొరత, సాంకేతిక అంశాలు వంటివి తోడు కావడంతో ఈ కీలకమైన కేసులు ఎప్పటికి కొలిక్కి వస్తాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
అదే అవకాశంగా టిడిపి ఎదురుదాడి ...
వైసిపి స్పీకర్ పై చేస్తున్న ఆరోపణలను టిడిపి ఖండిస్తోంది. స్పీకర్ తేల్చే అంశాన్ని కోర్టు కి అప్పగించింది వైసిపి వారేనని పేర్కొంటు తప్పు అంతా సుప్రీం కోర్టు ఆలస్యం చేయడం వల్లే అని తోసేస్తుంది. వాస్తవానికి స్పీకర్ నిర్ణయమే ఫిరాయింపుల అంశంలో సుప్రీం అయినప్పుడు, కోర్టు పరిధిలో వున్నా పార్టీ మారిన వారిపై వేటు వేయవచ్చు. కానీ టిడిపి మాత్రం ఏపీలో స్పీకర్ తప్పు ఏమి లేదని వైసిపి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్లే ఇదంతా జరిగిందనే ప్రచారం మొదలు పెట్టడం చర్చనీయాంశం.

