ఢిల్లీలో రచ్చ రచ్చేనా

పార్లమెంట్ కేంద్రంగా ఢిల్లీలో రచ్చకు అన్ని పార్టీలు రెడీ అయిపోయాయి. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని, విభజన హామీలు అమలు చేయాలంటూ వైసిపి ప్రత్యేక రైలు అమరావతి నుంచి బయల్దేరింది. మార్చి 5 న ఢిల్లీలో వైసిపి భారీ నిరసన ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసిపి నేతలు పార్థసారథి మల్లాది విష్ణు,తదితరులు ఢిల్లీ వెళుతున్న రైల్లో బయల్దేరి వెళ్ళారు. టిడిపి బిజెపి హోదా అంశంలో డ్రామాలు మొదలెట్టి రాష్ట్రాన్ని ముంచాయని ఈ సందర్భంగా నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. హోదా సాధించే వరకు పోరాటం ఆపేది లేదంటు ప్రకటించింది వైసిపి. తమ పార్టీ అధినేత నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరికి హోదా రాష్ట్రానికి సంజీవనే నమ్ముతున్నారని టిడిపి లా మాట మార్చే ప్రసక్తి లేదంటున్నారు వారు.
కాంగ్రెస్ ఆందోళన సక్సెస్ ....
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పోరాటం మొదలు పెట్టిన కాంగ్రెస్ 13 జిల్లాలో జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమం పూర్తి విజయవంతం అయ్యింది. ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డిని విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివిధ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఉద్యమానికి ప్రజలు మద్దత్తు ఇచ్చారు. కాంగ్రెస్ రాస్తారోకోలతో పలు జిల్లాలో ట్రాఫిక్ స్తంభించి పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాకీల చర్యలను నేతలు ఎండగట్టారు.
టిడిపి సైతం....
పార్లమెంట్ కేంద్రంగా తెలుగుదేశం ఎంపీల నిరసన గళం ఇక మరింత ఉధృతం అవుతుంది. అన్ని రాజకీయ పక్షాల మద్దతుతో విభజన హామీలు హోదా కోసం విపక్షాల కన్నా ఉధృతంగా ఉద్యమించాలని టిడిపి డిసైడ్ అయిపోయింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాబుతో ఫోన్లో మాట్లాడినా వెనుకంజ వేస్తే ప్రమాదమని బాబు ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. వెనక్కి తగ్గొద్దనే ఆదేశాలను ఇచ్చేశారు బాబు.
పోటా పోటీగా....
వాస్తవానికి ఏపీ కి జరిగిన అన్యాయం పై అన్ని పార్టీలు కలిసి గళం ఎత్తలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అయినప్పటికీ ఏపీలోని అన్ని పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగానే ఉద్యమాలు సాగిస్తున్నాయి. రాబోయేది ఎన్నికల తరుణం కావడంతో ఏ పార్టీ స్వార్ధం ఆ పార్టీ చూసుకుంటుంది.

