ఢిల్లీలో బాబు... సాధ్యమయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హస్తినలో హల్ చల్ చేయనున్నారు. నేడు, రేపు ఢిల్లీలోనే మకాం వేసి కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేయనున్నారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మోస పూరిత వైఖరిని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు ఈ ఢిల్లీ పర్యటన ఉపయోగపడుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంకా నాలుగురోజులే....
పార్లమెంటు సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నాయి. వచ్చే శుక్రవారంతో సభ నిరవధిక వాయిదా పడనుంది. ఈలోపలే ప్రభుత్వం నిరవధికంగా సభను వాయిదా వేసుకుని వెళ్లినా ఆశ్చర్యపడనక్కర లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాలులో వివిధ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలవనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు ఈరోజు, రేపు హస్తినలోనే మకాం వేసి జాతీయ స్థాయిలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నంలో ఉన్నారు.
20 పార్టీల నేతలతో.....
చంద్రబాబు దాదాపు 20 పార్టీలకు చెందిన నేతలను కలవనున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, అన్నాడీఎ:కే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, అకాళీదళ్, జేడీయూ జనతాదళ్ (ఎస్), శివసేన వంటి పార్టీ నేతలను కలసి కేంద్రంపై తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా గత పదిరోజులుగా ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఆయన జాతీయ మీడియాతో కూడా చెప్పనున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో కేంద్ర ప్రభుత్వం ఏపీ విభజన హామీల అమలుపై దిగివస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
ఇప్పుడు చక్రం లేదుగా....
అయితే బీజేపీ మాత్రం పెద్దగా పట్టించుకోనట్లే ఉంది. చంద్రబాబు ఒకప్పుడు హస్తినలో చక్రం తిప్పారని, అయితే ఇప్పుడు తిప్పడానికి ఆయన చేతిలో చక్రం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకేనని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆయన విమర్శించారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రబాబు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే ఢిల్లీలో తిష్ట వేశారంటోంది బీజేపీ.
