ఢిల్లీ ఫిక్స్ : మళ్లీ రంగంలోకి వచ్చిన పరకాల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీడియా సలహాదారు హోదాలో.. యావత్తు సకల రంగాలకు తానే సలహాదారు అయినంతగా.. అధికారిక ప్రకటనలు చేయడంలో ముఖ్యమంత్రి కంటె ప్రధానమైన వ్యక్తిగా చెలరేగుతూ ఉండే పరకాల ప్రభాకర్.. ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో మళ్లీ దర్శనమిస్తున్నారు. ముఖ్యమంత్రినే బైపాస్ చేసేంతగా పరకాల ప్రభాకర్ వ్యవహారాలు శృతిమించిపోతున్నాయన్న ఉద్దేశంతో సీఎం ఆయన పట్ల కినుక వహించినట్లు ఇటీవలి కాలంలో పుకార్లు వచ్చాయి. దానికి తగినట్లుగానే.. సాధారణంగా అమరావతిలో అన్నీ తానే అయి చెలామణీలో ఉండే ఆయన కొన్ని నెలల పాటూ అసలక్కడ కనిపించలేదు, వినిపించలేదు. ఇదంతా కలిపి సీఎం చంద్రబాబు ఆయనను పక్కన పెట్టేశారనే పుకార్లకు ఊతమిచ్చింది. కాకపోతే.. తాజాగా మళ్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో పరకాల ప్రభాకర్ కనిపించడం అందరికీ ఆసక్తి గొలుపుతోంది.
పరకాల ప్రభాకర్ అంటే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు భర్త. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉండిన ఆయన పార్టీనుంచి బయటకు వస్తూ.. ఆ పార్టీ మీడియా సెంటర్ లోనే ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి మీద భారీస్థాయిలో నిందలు వేసి.. దులుపుకుని వచ్చేసిన నాయకుడు. రాష్ట్ర విభజనకు ఉద్యమం జరుగుతున్నప్పుడు.. సమైక్యాంధ్ర వాదన కు కట్టుబడి పెద్ద ఎత్తున్న ప్రచారం చేశారు. ఊరూరా తిరిగారు. అప్పటివరకూ ఆయన మీద భాజపా ముద్రే ఉండేది. విభజన జరిగిపోయి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే... ఆయన చంద్రబాబు పంచన చేరారు.
చంద్రబాబునాయుడు కూడా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త గనుక, కేంద్రంలో చక్రం తిప్పే కీలక మంత్రుల్లో ఆమె ఒకరు గనుక, కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు చక్కబెట్టుకోవడానికి ఇది కాస్త ఉపయోగపడుతుందని, కాస్త ఉదారంగా వ్యవహరించి పరకాలకు కేబినెట్ హోదాలో మీడియా సలహాదారు పదవి ఇచ్చారు. తాను మీడియా సలహాదారు అనే పదం మీడియాలో ఎవ్వరూ వాడకుండా, ప్రభుత్వ సలహాదారుగా మాత్రమే చెలామణీ అవుతూ.. అన్ని రంగాల్లోనూ పరకాల ప్రభాకర్ పెత్తనం సాగుతూ ఉండేది. అయితే ఇటీవల చంద్రబాబునాయుడు దూరం పెట్టినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా పరకాల స్వరం మళ్లీ మీడియా ముందు వినిపిస్తోంది.
అయితే.. చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలోనే పరకాల సమస్య ‘ఫిక్స్’ అయిందనీ, ఆ తర్వాతే.. పరకాల తిరిగి రంగంలోకి రాగలిగారని కూడా అమరావతిలో వదంతులు వినిపిస్తున్నాయి మరి!!

