డోన్ట్ కేర్ అంటున్న కేసీఆర్

కేసీఆర్ దూకుడికి విపక్షాలు కుదేలైపోతున్నాయి. గత పదిహేను రోజులుగా అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే కేసీఆర్ ప్రతి ప్రశ్నకూ సమాధానం తానే చెబుతున్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తానే తిప్పికొడుతున్నారు. సభలో ఆయన ఉంటూ వారి విమర్శలను వింటూ వెంటనే సమాధానం చెబుతున్నారు. విపక్షాలు గుక్కతిప్పుకోకుండా మాటల దాడిని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. పాలకులు 60 ఏళ్లలో చేయలేనిది... తాము నలభై నెలల్లో చేసి చూయించామని చెబుతూ.. ఉదాహరణలను వివరిస్తూ ప్రతిపక్ష పార్టీల నోళ్లు మూయించేస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ ప్రతి ప్రశ్నకూ స్వయంగా సమాధానం చెబుతుండటంతో విపక్ష నేతలు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.
వన్ మ్యాన్ షో గానే....
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఆయనే అన్నింటికీ సమాధానం చెబుతూ విపక్షాలను కట్టడి చేస్తుండటం గత కొన్ని రోజులుగా కన్పిస్తోంది. సభ మొదలయిన నాటి నుంచి ఇదే పరిస్థితి. మంత్రులు కేవలం ప్రశ్నోత్తరాల సమయంలోనే జవాబిస్తున్నారు. ప్రతిపక్షాలు ఇచ్చిన ఏ ఒక్క వాయిదా తీర్మానం కూడా ఇప్పటి వరకూ ఆమోదించలేదు. వాటిని తిరస్కరిస్తూ లఘు చర్చల్లో విపక్షాలపై ఎదురుదాడి చేస్తూ కేసీఆర్ విపక్షాలను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. పాపాలన్నీ కాంగ్రెస్ కే అంటగడుతున్నారు. ఇక సీఎం చేసిన విమర్శలపై స్పందిద్దామన్నా విపక్ష నేతలకు ఆ అవకాశం చిక్కడం లేదు. దీంతో విపక్షాలు కొన్ని సార్లు నిరసన తెలిపి వాకౌట్ చేసి వెళ్లిపోతున్నాయి. అయినా కేసీఆర్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. రైతు సమస్యలపైనా కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేశారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాలైన హరితహారం, 24 గంటల ఉచిత విద్యుత్తు, దళితులకు మూడు ఎకరాల భూమి, భూరికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్లు, మైనారిటీ సంక్షేమం , ఉచిత వైద్యం, విద్య, ఇలాంటి అంశాలన్నింటినీ హైలెట్ చేస్తూ కేసీఆర్ ముందుకు వెళుతున్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, తెలంగాణ అప్పులు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ, ఎస్పీ వర్గీకరణ వంటి అంశాలపై చర్చకు రానివ్వకుండా కేసీఆర్ తన పథకాలనే చెప్పుకుంటూ వెళుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. కనుసైగలతోనే కేసీఆర్ సభను నడుపుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద కేసీఆర్ అసెంబ్లీలో వన్ మ్యాన్ షో నిర్వహిస్తున్నారంటున్నారు.
- Tags
- కేసీఆర్

