టెన్షన్ లో టిడిపి ఎమ్యెల్యేలు ....?

టిడిపి స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రబాబు ఎమ్యెల్యే విద్యార్థులను రాచి రంపాన పెడుతున్నారు. బాగా చదవండిరా బాబు అని చెప్పినా, మార్క్ లు ఎక్కువ తెచ్చుకోమన్నా మొద్దబ్బాయిల్లా సి గ్రేడ్ తో వారు సరిపెట్టుకోవడాన్ని హెడ్ మాస్టర్ సీరియస్ గా తీసుకున్నారు. స్పెషల్ క్లాస్ పెట్టి మరి రేవు పెట్టారు చంద్రబాబు . ఇదంతా ఇంటింటికి తెలుగుదేశం యవ్వారం. ఏపీలోని 13 జిల్లాలలో పార్టీ కార్యక్రమమం మొక్కుబడిగా సాగుతుందన్న నివేదికలు అధినేత కు కోపం తెప్పించాయి. అంతే ఆయన హెడ్ మాస్టర్ లా మారిపోయి స్కూల్ ని గాడిన పెట్టె పనిలో పడ్డారు.
ఇదెక్కడి గొడవరా "బాబు "...
బోల్డు డబ్బు ఖర్చు పెట్టి ఎమ్యెల్యేలు అయ్యింది ఈ తిట్ల దండకం కోసమా అని ఇప్పుడు కొందరు టిడిపి ఎమ్యెల్యేలు మధన పడుతున్నారట. ఎంత పని చేసినా చంద్రబాబు మార్కులు తక్కువే వేస్తున్నారని ఎమ్యెల్యేలు వాపోతున్నారు. గతంలో మంత్రులకు మార్కులు వేసినప్పుడు మంత్రి నారాయణకు తక్కువ గ్రేడ్ తెచ్చుకోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. బాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు మిగిలిన జిల్లాల్లో ఇంటింటికి తెలుగు దేశం ఎలా వున్నా ఇక్కడా చాలా బాగా జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు . వెంటనే చంద్రబాబు బాగా జరిగితే తూగోజిల్లా ఎందుకు సి గ్రేడ్ మాత్రమే సాధించిందో చెప్పాలనడంతో తోట షాక్ అయ్యారు. ఇలా ప్రతి జిల్లా లోని నేతలను బాబు ముప్పుతిప్పలు పెట్టి ఏమిటి మీ మార్కులు అంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ మొహాన కొట్టినంత పనిచేస్తున్నారు.
గతంలో అధికారులపై ... ఇప్పుడు ప్రజా ప్రతినిధులపై ...
చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ సూపర్ అనే పేరు రావడానికి కారణం గతంలో ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ లతో అధికారులను పరుగులు పెట్టించడమే అంటారు. బాబు ఇప్పుడు కొత్త చంద్రబాబు అయ్యారు. ఈసారి ఆయన టార్గెట్ ఎమ్యెల్యేలనే చేశారు. ఉద్యోగులు ఓట్లు 2004 లో వ్యతిరేకంగా పోల్ కావడంతో వారితో పెట్టుకుంటే నాలుగు ఓట్లు పోతాయనే భయంతో ఎమ్యెల్యేలను తాటతీసే క్రమానికి శ్రీకారం చుట్టారు. వారం వారం చంద్రబాబు తెప్పించుకునే నివేదికలపై పార్టీ కార్యక్రమాలను ఆయన సమీక్షించడం టెలి , వీడియో కాన్ఫెరెన్స్ లతో వచ్చే ఎన్నికల్లో కాన్ఫిడెన్స్ పెంచుకునే పనిలో బిజీ అయ్యారు . ఈ నేపథ్యంలోనే ప్రతివారం ఇక ఎమ్యెల్యేలకు రేవ్ పార్టీలు తప్పేలా లేవు .
- Tags
- టీడీపీ

