టీడీపీలోకి మాజీ సీఎం కుటుంబం

చిత్తూరు జిల్లాలో రాజకీయంగా ఒక పెద్దకుటుంబం సైకలెక్కనుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి భేటీ అవుతున్నారు. నల్లారి ఫ్యామిలీ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన గతంలో చీఫ్ విప్, స్పీకర్ గానూ పనిచేశారు. చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి, పెద్దిరెడ్డి ఫ్యామిలీకి పడదు. అయితే ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో ఉండటంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఆయన తనయుడు టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తనకు పార్టీలో లభించే అవకాశాలు, వచ్చే ఎన్నికల్లో సీట్ల విషయమై నల్లారి కిషోర్ చర్చిస్తారని తెలుస్తోంది.
నేడు చంద్రబాబుతో చర్చలు....
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఆయన తనయుడు అమర్నాధ్ రెడ్డి పీలేరు నియోజకవర్గంలో ఇటీవల విస్తృతంగా పర్యటించారు. ప్రజా భిప్రాయాన్ని తీసుకునేందుకే తాము పీలేరు పర్యటించామంటున్నారు. తమ అనుచరుల నుంచి తీవ్ర వత్తిడి వస్తుండటంతో రాజకీయంగా మళ్లీ పునరాగమనం చేసేందుకు రెడీ అయిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడిన నల్లారి కుటుంబం సమైక్యాంధ్ర పార్టీని పెట్టింది. అయితే ఈ పార్టీకి గత ఎన్నికల్లో ఏ ఒక్కరికీ డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో గత మూడున్నరేళ్ల నుంచి నల్లారి కుటుంబం మీమాంసంలోనే ఉంది. ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేక పోయింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు పీలేరు అసెంబ్లీ టిక్కెట్, ఆయన తనయుడు అమర్నాధ్ రెడ్డికి రాజంపేట ఎంపీ టిక్కెట్ అడగాలన్న యోచనలో నల్లారి కుటుంబం ఉంది. దీనిపై ఈరోజు చంద్రబాబు నుంచి క్లారిటీ తీసుకోనున్నారు.

