టీడీపీలో సీఎం రమేష్ ప్రాభవం తగ్గినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యవహారంపై మండిపడుతున్నారు. సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ కనస్ట్రక్షన్స్ పనులు పొందడమే తప్ప సకాలంలో పనులు చేయడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతకొంత కాలంగా సీఎం రమేష్ కు చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సోమవారం ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ నీటి ప్రాజెక్టులపై సమీక్షను నిర్వహించారు. అయితే ఈ సమీక్షలో గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను మందకొడిగా నడుస్తున్నట్లు తెలిసిన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు సీఎం రమేష్ సోదరుడు రాజేష్ కూడా వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాకపోవడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులను పంపి సామాగ్రిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రాజెక్టు పనుల్లో అలసత్వం....
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఎంపీ సీఎం రమేష్ కు చెందిన కంపెనీ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను పొందింది. ఇందులో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు రహదారులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు పనుల్లో సీఎం రమేష్ సంస్థ తీవ్ర జాప్యం చేస్తుందని గత కొంతకాలంగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారులు కూడా ఎంపీకి చెందిన సంస్థ కావడంతో ఏమీ అనలేక పోతున్నారు. గండికోట రిజర్వాయర్ పనులపై ఇప్పటికే మంత్రి ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించవద్దని, ఎంతటి వారైనా నిబంధలనకు లోబడే పనిచేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే పోలవరం పనులు చేపడుతున్న ట్రాన్స్ ట్రాయ్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం మీద సీఎం రమేష్ సంస్థపై ముఖ్యమంత్రి చిందులు వేయడంతో అధికారులు కూడా విస్తుబోయారు. సాధారణంగా ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షకు కాంట్రాక్టర్లు కూడా హాజరుకావాల్సి ఉంటుంది. అయితే సీఎం రమేష్ సోదరుడు మాత్రం హాజరు కాలేదు. దీనిపై ముఖ్యమంత్రి మరింత కోపాన్ని వెళ్లగక్కినట్లు అధికారులు చెబుతున్నారు.
- Tags
- సీఎం రమేష్

