టీడీపీలో రాజీనామాల కలకలం

అధికార పార్టీలో అలకలు ఎక్కువవుతున్నాయి. నిన్న గాక మొన్న చిత్తూరు జిల్లా మదనపల్లిలో కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా మచిలీపట్నం టీడీపీలో ముసలం పుట్టింది. రాష్ట్ర రాజధానిగా ఉన్న విజయవాడలో కూడా నిన్నటి వరకూ మేయర్, కార్పొరేటర్ల మధ్య వివాదం నడిచింది. అయితే లోకేష్ జోక్యంతో మేయర్ కోనేరు శ్రీధర్ నుకొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం చల్లబడక ముందే మచిలీపట్నంలోని టీడీపీలో కలకలం రేగింది. కొందరు టీడీపీ నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు.
కష్టపడిన వారికి.....
అధికారంలోకి తమ పార్టీ వస్తే సహజంగానే తమకు పదవులు వస్తాయని భావిస్తారు కొందరు ద్వితీయ శ్రేణి నేతలు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అన్ని అవమానాలు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తెస్తే పదవులను కొందరు పైరవీలతో తన్నుకుపోతున్నారని తెలుగు తమ్ముళ్లు మధనపడి పోతున్నారు. ఇందుకు ఉదాహరణే కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ పోస్టు. ఈ పోస్టు కోసం టీడీపీ నేత గొర్రెపాటి గోపీచంద్ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. స్థానికనేతలతో పాటు పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తాను పార్టీకి ఎలా కష్టపడ్డాననేది వివరించారు.
ఒక సామాజిక వర్గానికేనా?
అయితే కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ పదవికి నందిగామకు చెందిన బండారు హనుమంతరావుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని వెనక మంత్రి దేవినేని ఉమ ఉన్నారని గొర్రెపాటి వర్గం భావిస్తోంది. తమ నియోజకవర్గంలో ఏ పదవులనైనా ఒక సామాజిక వర్గానికే ఇస్తున్నారని గొర్రెపాటి వర్గీయులు బహిరంగంగా పార్టీ నేతలపై ధ్వజమెత్తుతున్నారు. దీంతో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీ చంద్ రాజీనామాకు సిద్ధపడ్డారు. గొర్రెపాటితో పాటుగా బందరు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కుంచె నాని, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు గణతిశెట్టి గోపాల్ రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై వారు మరికొద్దిసేపట్లో ప్రకటన చేసే అవకాశముందంటున్నారు. మొత్తం మీద టీడీపీలో పదవుల పందేరంలో తేడాలు రావడంతో అప్పటి వరకూ ఆశలు పెట్టుకున్న వారు రాజీనామాలకు సిద్దమవుతున్నారు.
- Tags
- టీడీపీ

