టీఆర్ఎస్ లో వీరున్నా ఒకటే...లేకున్నా ఒకటే..!

టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులు కేవలం పదవులకే తప్ప ఎలాంటి కార్యాచరణ చేపట్టడం లేదు. టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులుగా కేసీఆర్ మూడు నెలల క్రితం నియమించినా వారు ఇంకా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఎటువంటి సమీక్షలు లేవు. సమావేశాలు లేవు. పార్టీ పరిస్థితిపై అధ్యయనం లేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. మూడు నెలల క్రితం నియమించినా వీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇలా అలక్ష్యం చేస్తే సహించబోనని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు చెబుతున్నారు.
కార్యవర్గం ఏం చేస్తోంది?
కేసీఆర్ ఈ ఏడాది అక్టోబర్ లో 67 మంది సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 20 మంది ప్రధాన కార్యదర్శులుండగా, 33 మంది కార్యదర్శులు, 12 మంది సహాయ కార్యదర్శులున్నారు. వీరిలో 40 మందికి ఒక్కొక్కరికి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను అప్పగించారు. 12 మందికి ఒక్కొక్కరికి పది అసెంబ్లీ స్థానాలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. మిగిలిన వారికి పార్టీ అనుబంధ సంఘాలను, శిక్షణ శిబిరాల వంటివి చేపట్టాలని గట్టిగా హెచ్చరించారు. వీరు ఏ ఏ కార్యక్రమాలు చేయాలో సమావేశంలో విస్పష్టంగా గులాబీ దళపతి చెప్పారు. నియోజకవర్గాల వారీగా నివేదికను ఎప్పటికప్పుడు తనకు అందించాలని కోరారు.
సమస్యలను పట్టించుకోకుండా...
అయితే వీరెవ్వరూ తమకు అప్పటించిన బాధ్యతలను నిర్వర్తించడం లేదని తేలింది. ఇంకా నియోజకవర్గాల్లోనే కొందరు పర్యటించకపోవడం విశేషం. నియోజకవర్గానికి వెళ్లి అక్కడ సమీక్షలు కూడా జరపలేదు. ముఖ్యమంత్రికి నివేదికను సయితం పంపలేదు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు గొడవలు ముదిరి వీధినపడ్డాయి. కాని వీటన్నింటినీ పరిష్కరించి అధినేతకు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాల్సిన కార్యవర్గ సభ్యులు వీటి జోలికి పోవడం లేదు. ఇప్పటికే టిక్కెట్ల కోసం ఒకరికొకరు పోటీ పడి గ్రూపులుగా మారిపోయారు. నేతల మధ్య సయోధ్య కుదర్చాల్సిన వీరు పట్టించుకోకపోవడంతో కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. అసలు కార్యవర్గం ఎందుకు ఏర్పాటు చేశారో కూడా వీరికి అర్థం కాదా? అని అయన ప్రశ్నించారు.
- Tags
- కేసీఆర్

