టీఆర్ఎస్ కు బ్రేక్ లు...కీలక నేతలు జంప్..!

వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎదురు లేకుండా దూసుకెళుతోన్న అధికార టీఆర్ఎస్ పార్టీకి బ్రేకులు పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కీలక నేతలను కారెక్కించేసుకున్న కేసీఆర్‌కు ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పలువురు కీలక నేతలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లోకి జంప్ చేసేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్ది టీ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. బీజేపీ, టీడీపీల నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం అయింది.
వీరికి లైన్ క్లియర్....
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగం జనార్దన్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి, నల్లగొండ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డిలకు కాంగ్రెస్‌లో చేరేందుకు లైన్ క్లియర్ అయిందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కొంత కాలంగా రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ లోకి వలసలు విపరీతంగా పెరిగాయి. కాగా ఈ ఒరవడికి భిన్నంగా తెలంగాణ పాలిటిక్స్‌లో పదే పదే కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తే ఫైర్‌బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనను అనుసరించి పలువురు టీడీపీ నేతలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాంగ్రెస్ లో చేరారు.
టిక్కెట్ దక్కదనేనా?
అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుండటం, మరో వైపు అధికార పార్టీలో చేరినా టికెట్ దక్కడం కష్టమనే భావన చాలా మంది నాయకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం కూడా పలువురు రాష్ట్రంలో పలువురు కీలక నేతలను తమ పార్టీలోచేర్చుకునేందుకు పావులు కదపుతున్నట్లు తెలస్తోంది. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ బండి ఓవర్‌లోడ్ అయ్యింది. టీఆర్ఎస్లో గ్యారెంటీగా టిక్కెట్ దక్కదని భావిస్తోన్న నేతలు కూడా కాంగ్రెస్ గూటికి జంప్ చేసేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పోట్ల నాగేశ్వరరావు ఈ కోవలోనే కాంగ్రెస్‌లో చేరిపోయారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా ఇటీవల త్వరలోనే చేరికలు ఉంటాయని చెప్పడం ఇందుకు నిదర్శనం.
ఎవరెవరు... ఎందుకు?
పై నాయకులతో పాటు ఖమ్మం మాజీ ఎంపీ, టీడీపీ నేత నామా నాగేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరకకు రంగం సిద్ధమైందని జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఈయన అదే విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కూడా పలవురు టీడీపీ, బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పలువురు విద్యార్థి నాయకులు కూడా కాంగ్రెస్ గూటికి చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలువురు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పకునేందుకు సద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో రాహుల్ పర్యటన సందర్భంగా ఈ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటుండటం గమనార్హం.

