టీఆర్ఎస్ కు ఈ ఎమ్మెల్సీ తలనొప్పి

నిన్న మొన్నటి వరకూ కేవలం కార్పొరేటర్లే జులుం ప్రదర్శించేవారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటేర్ల ఆగడాలతోనే అధినేతకు విసిగెత్తి పోతుంటే తాజాగా ఎమ్మెల్సీ దాడికి దిగడం అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ఒక మహిళను అనరాని మాటలు అనడం, చెప్పుతో కొట్టబోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ పై కేసు నమోదుచేశారు. తనపై అనుచితంగా ప్రవర్తించిన తీరును ఆమె వీడియో టేపుల ద్వారా బహిర్గతం చేసింది. దీనిపై నాంపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాని ఎమ్మెల్సీ అలా ప్రవర్తించి ఉండకూడదన్న వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సంఘటనపై ఆరా తీసినట్లు తెలిసింది. ఎందుకు ఫారూఖ్ హుస్సేన్ అలా ప్రవర్తించారన్న దానిపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి గులాబీ బాస్ వివరణ కోరారు.
మహిళపై దౌర్జన్యం........
అధికార పార్టీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నాంపల్లిలోని స్కిల్ స్ల్పెండర్ లోని రెండో అంతస్థులో నివాసముంటున్నారు.ఇది అద్దెకు తీసుకున్న ఫారూఖ్ హుస్సేన్ గత నాలుగేళ్లుగా అందులోనే నివాసముంటున్నారు. అయితే తన ఫ్లాట్ ఖాళీ చేయాల్సిందిగా ఎన్ఆర్ఐ మహిళ అంతుల్ వాసే రెండేళ్లుగా కోరుతున్నారు. కాని ఫారూఖ్ హుస్సేన్ ఖాళీ చేయడం లేదు. దీంతో ఈరోజు ఆయన ఇంటికి వెళ్లి ఎప్పుడు ఖాళీ చేస్తారని ప్రశ్నించగా మహిళను దుర్భాషలాడినట్లు వీడియో టేపులో స్పష్టంగా కన్పిస్తోంది. తనపై చెప్పుతో దాడికి దిగారని, అనరాని మాటలు అన్నారని నాంపల్లి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 504, 506, 509 సెక్షన్ల కింద ఎమ్మెల్సీ పై కేసు నమోదు చేశారు. అయితే ఫారూఖ్ హుస్సేన్ మాత్రం తాను మహిళను ఏమీ అనలేదని,అసలు ఆమె ఇంటి యజమానురాలు కానేకాదని చెబుతున్నారు. రెంటల్ అగ్రిమెంట్ ప్రకారమే తాను ఇంటిని అద్దెకు తీసుకున్నానని, ఇంటి యజమానులు తనను ఖాళీ చేయమని కోరలేదని, ఈ మహిళ వచ్చి తనను అనవసరంగా వివాదంలోకి లాగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే క్వార్టర్ లో క్వార్టర్ రెడీ అవుతుందని, తాను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్సీ చెబుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.

